Konda Surekha: తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు రేగాయి. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆరోపణలు పార్టీ వర్గాల్లో దుమారం రేపాయి. వరంగల్ జిల్లా వేదికగా జరిగిన ఈ రాజకీయ రచ్చ చివరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరి, మంత్రి కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోాజ్ నోటీసులు జారీ చేసే స్థాయికి చేరింది. దీనిపై ఆగస్టు 20న మంత్రి కొండా సురేఖ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లెటర్ రాశారు.
వరంగల్ వేదికగా కొండా సుస్మితా పటేల్ సంచలనాత్మక వ్యాఖ్యలు
మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.
సుస్మితా పటేల్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదని విమర్శించారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారిపైనే సీఎం ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నారని, రాష్ట్రంలో కేవలం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోందని, అసలైన అచ్చ కాంగ్రెస్ శ్రేణులకు స్థానం లేకుండా చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరూ సంతోషంగా లేరని ఆమె కామెంట్ చేశారు.
పీసీసీ సీరియస్- మంత్రి కొండా సురేఖకు నోటీసు
మంత్రి కుమార్తె నేరుగా ముఖ్యమంత్రి, ఆయన తమ్ముడిపై వందల కోట్ల ఆరోపణలు చేయడం, పార్టీ నిర్ణయాలను తప్పుపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పీసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా పీసీసీని ఆదేశించారు.
దీంతో రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి స్పందించారు. సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కుమార్తె చేసిన విమర్శలకు తల్లిగా మంత్రిగా కొండ సురేఖే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిటీ భావించింది.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పరిణామాలై స్పందిస్తూ పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడినా తీవ్ర క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చించారు. కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ కూడా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వల్ల మంత్రి కొండా సురేఖ పార్టీ ముందు తలదించుకోవాల్సి వస్తోందని విమర్శించారు.
నోటీసులు ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ రిక్వస్ట్
పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై స్పందిస్తూ, ఆగస్టు 20, గురువారం నాడు మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. ఆ లేఖలో కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించకుండానే ఆ వ్యాఖ్యల బాధ్యతను తనపై వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. " సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఒక స్వతంత్ర వ్యక్తిగా తన అభిప్రాయాలను మీడియా ముందు పంచుకున్నారు. ఆ వ్యాఖ్యల వ్యవహారంలో నా ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలను ప్రాతిపదిక పార్టీ ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు" అని సురేఖ లేఖలో స్పష్టం చేశారు.
తనకు నోటీసులు ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని, కానీ తనకు సంబంధం లేని ఈ అంశంలో వివరణ కోరడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును వెంటనే ఉపసంహించుకోవాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కేసు
ఈ పొలిటికల్ హైడ్రామా నడుస్తుండగానే, మంత్రి కొండా సురేఖ కుటుంబానికి అనుబంధంగా ఉన్న మరో తీవ్రమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.
బాధితుడు గొంగడి హరికృష్ణ ఇచ్చిన రాత పూర్వక ఫిర్యాదు మేరకు... సుమంత అన అనుచరులతో కలిసి ఇనుప రాడ్లతో తనపై దాడికి పాల్పడ్డాడని, తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 కింద సుమంత్, అతనితోపాటు ఉన్న మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. అయితే ఘటనా స్థలం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో కేసు రికార్డులను, డాక్యుమెంట్స్‌ు తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
సుమంత్ గతంలో మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పని చేశారు. అయితే అతనిపై అంతకుముందే పలు అవినీతి, బలవంతపు వసూళ్ల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అతనిని ఓఎస్డీ బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు నేరుగా హత్యాయత్నం కేసు నమోదు కావడం కొండా సురేఖ కుటుంబానికి రాజీయగా మరింత ఇబ్బందికరంగా మారింది.
