Kakatiya University Student Protest: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసకు దారితీసింది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఫర్నీచర్ ధ్వంసం అయింది. అసలేం జరిగిందంటే.. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల కింద పీహెచ్‌డీ కేటగిరి-2 అడ్మిషన్లు చేపట్టింది విశ్వవిద్యాలయం. అయితే ఈ అడ్మిషన్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అక్రమాలను నిగ్గు తేల్చాలని, అర్హులైన వారికి మాత్రమే అడ్మిషన్లు దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. ర్యాలీగా వచ్చిన విద్యార్థులు వీసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.


ఒకానొక దశలో ఆందోళన చేసిన విద్యార్థులు వీసీ ఛాంబర్  లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఉపకులపతి రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో విద్యార్తులు వాగ్వాదానికి దిగారు. 75 శాతం అడ్మిషన్లను వీసీ, రిజిస్ట్రార్, అన్ని విభాగాల డీన్స్ అమ్ముకున్నారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఫర్నీచర్ కూడా ధ్వంసం అయింది.