Pahalgam Terror Attack : తెలంగాణలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులకు డీజీపీ జితేందర్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే పద్ధతిగా దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలని సూచించారు. 29 తర్వాత వీసాలు రద్దు అవుతాయని అన్నారు. తర్వాత చిక్కితే జైలు పాలు అవుతారని వారించారు. అంత వరకు తెచ్చుకోవాలని హితవు పలికారు.
ఉద్యోగాల నిమిత్తం, ఆసుపత్రికో, బంధువుల ఇంటికో వచ్చిన పాకిస్థానీలు వెంటనే బ్యాగులు సర్దుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్ సూచించారు. కేంద్రం ఆదేశాల మేరకు 29 లోపు వెళ్లిపోవాలని తెలిపారు. అక్రమంగా ఉన్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
కేంద్రమంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముందుగా డీజీపీ జితేందర్‌తో మాట్లాడినట్టు సమాచారం. కేంద్రం ఆదేశాల మేరకు పాకిస్థానీయులు ఒక్కరు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని అందుకే ఈ చర్యలు ప్రారంభించింది.
ఉదయం సీఎంలకు ఫోన్ చేసిన అమిత్‌షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం దేశంలోని ముఖ్యమంత్రులందరితో మాట్లాడి, వారి రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులను గుర్తించాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పాకిస్తానీ పౌరుల వీసాలను వెంటనే రద్దు చేసి, వారిని భారతదేశం నుంచి పంపడానికి వీలుగా వారి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులను కోరారు.ప్రభుత్వం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంది
2025 ఏప్రిల్ 22న, పహల్గామ్‌లోని బైసరన్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయ పర్యాటకులు, ఒక నేపాలీ జాతీయుడు మరణించారు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఈ దాడి ఒకటి. ఈ దాడికి పాకిస్తాన్ ఉసిగొల్పిన ఉగ్రవాదమే కారణమని భారతదేశం ఆరోపించింది. ప్రతిగా అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. వీటిలో 1960 సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అట్టారి-వాఘా సరిహద్దు మూసివేయడం, పాకిస్తాన్ సైనిక అధికారులను న్యూఢిల్లీ నుంచి బహిష్కరించడం, పాకిస్తాన్ పౌరులందరి వీసాలను రద్దు చేసింది.
వీసా రద్దు విధానం
హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, అమిత్ షా ముఖ్యమంత్రులను వారి రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల జాబితా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. పాకిస్తాన్ పౌరుల ప్రస్తుత వీసాలన్నీ 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు అవుతాయి. అయితే వైద్య వీసాలు 2025 ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటులో ఉంటాయి. దీనితోపాటు పాకిస్థాన్‌లో ఉ్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా పాకిస్తాన్ నుంచి తిరిగి రావాలని ప్రభుత్వం సూచించారు.
అధిక ప్రాధాన్యతా క్రమంలో దీన్ని తీసుకోవాలని ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలను కాపాడాలని అమిత్ షా ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ పౌరులను గుర్తించి వారి వీసాలను రద్దు చేసే ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం చేయకూడదని కూడా ఆయన అన్నారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి మరింత క్లోజ్ పనిచేస్తోందని సమాచారం.
పాకిస్తాన్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలు
పహల్గామ్ దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారతదేశం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు సైనిక సలహాదారులను బహిష్కరించింది. ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి కుదించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ తన గగనతలంలోకి భారత్ విమానాలను నిషేధించింది. భారతదేశంతో అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ "యుద్ధ చర్య"గా అభివర్ణించింది.