Jayashankar Bhupalpally | భూపాలపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో పలు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు వర్షాలు, వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర  సరిహద్దు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , ఎస్పీ కిరణ్ ఖరే పర్యటించారు. విపత్తు నిర్వహణ బృందం పనితీరును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎస్పీ కిరణ్ ఖరే పరిశీలించారు.


మహాదేవ్ పూర్ మండలం పెద్దంపేట వాగు వంతెనను కలెక్టర్, ఎస్పీలు శనివారం నాడు పరిశీలించారు. అక్కడి నుంచి విపత్తు నివారణ కు 10 మంది శిక్షణ పొంది, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహణ బృందం పనితీరును కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే పరిశీలించారు. ఈ సందర్బంగా  ఎస్పి గారు వరదల సమయంలో ప్రజలను రక్షించే స్పీడ్ బోట్ ను స్వయంగా నడిపి, గోదావరి వరద ఉధృతిని వారు పరిశీలించారు. అనంతరం పలిమల మండలం దమ్మూరు గ్రామంలో  ప్రజలతో మమేకమై వారి సమస్యలను కలెక్టర్, ఎస్పీలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 




ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ.. వర్షాలు, వరదల సమయంలో గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో వరదలు సంభవించినప్పుడు పనిచేయాలన్నారు. ఈ బృందం వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడుతుందన్నారు. పది మంది శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా సేవ్ చేయనున్నారు. అత్యవసర సమయంలో వరదలు సంబంధించినప్పుడు రక్షణ చర్యలు చేపట్టేందుకు వాటర్ బోట్ ను ఉపయోగిస్తారని తెలిపారు.