Telangana News: అసలే వేసవి కాలం, మరోవైపు లోక్‌సభ ఎన్నికలు... మరోవైపు అడవిని జల్లెడ పట్టేస్తున్న భద్రతా బలగాలు.. మొత్తానికి మావోయిస్టులకు పెద్ద చిక్కే వచ్చి పడింది. అందుకే నెల రోజులుగా అడవిలో తుపాకుల మోత పెరుగూ వస్తోంది. ఇది మావోయిస్టులకు కోలుకొని దెబ్బ తీస్తోంది. వరుస ఎన్‌కౌంటర్లతో దళాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
ఉక్కిరిబిక్కిరి
నెలరోజుల వ్యవధిలో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు మావోయిస్టులకు గడ్డుకాలం మొదలైనట్టే. ఆకు రాలే కాలాన్ని అనుకూలంగా మార్చుకునే భద్రతా సిబ్బంది వేట మొదలు పెడుతుంటారు. అందులో ఎన్నికల సీజన్ కూడా కలిసి వచ్చింది. అందుకే వరుస ఎన్కౌంటర్లతో పచ్చని అడవి నెత్తుటి రంగును పూసుకుంటోంది.
లేటెస్ట్ టెక్నాలజీతో నిఘా
మావోయిస్టులను అంతమొందించడానికి భద్రతా బలగాలు వేసవిని ఉపయోగించుకుంటున్నాయి. దీనికి తోడు ఆధునిక టెక్నాలజీ కూడా వారికి మరింత సాయం చేస్తోంది. గూగుల్ మ్యాప్, శాటిలైట్, డ్రోన్ల వ్యవస్థతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మావోయిస్టులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అందుకే ఆకు రాలుతున్నట్టు మావోయిస్టులు నెలరాలుతున్నారు.
కలిసిరాని వేసవి
వేసవికాలం మావోయిస్టులకు కలిసి రాని కాలం. మావోయిస్టులకు పచ్చని అడవులు షెల్టర్ జోన్లు. అడవి ఎంత పచ్చగా ఉంటే మావోలు అడవుల్లో అంత బలంగా ఉంటారు. వేసవి కాలంలో పచ్చని అడవి ఆకురాల్చి ఎడారిగా మారుతుంది. దీంతో మావోలకు సురక్షితమైన షెల్టర్ జోన్లు లేకుండా పోతాయి. మావోలు ఎక్కువగా నీటి మీద ఆధారపడి ఉంటారు. వేసవికాలం కావడంతో అడవుల్లో నేటికుంటలు, చెలిమలు ఎండిపోతాయి. దీంతో మావోయిస్టులు నీటి గోదావరి పరివాహక ప్రాంత వాగుల వెంట రాకతప్పదు. అంతేకాకుండా సేఫ్ జోన్‌లకు వెళ్ళడానికి రాష్ట్రాల సరిహద్దులు దాటాల్సి వస్తుంది.
మంచి తరుణం అంటున్న బలగాలు
మావోయిస్టుల ఏరివేతకు ఎండాకాలం అనువైనది భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర బలగాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో జల్లెడతున్నారు. కూంబింగ్‌తోపాటు శాటిలైట్, మూడు రాష్ట్రాల్లోని గోదావరి వెంట గూగుల్ మ్యాప్‌లతో మావోయిస్టుల ఏరివేత జరుగుతుంది. అన్నీ కలిసి వచ్చి పైచేయి సాధిస్తున్నాయి పోలీస్ బలగాలు. అందుకు నెల రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లే నిదర్శనంగా చెప్పవచ్చు.
కాల్పుల మోత
మార్చి 19న మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర బీజాపూర్‌లోనీ ప్రాణహిత నది దాటి సమయంలో పోలీస్‌లకు మావోలకు ఎదురుకాల్పులు జరిగాయని పోలీస్‌లు తెలిపారు.మార్చి 27న చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగి ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలోని చీపుర్‌భట్టి ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగి ఒక డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మావోలు మృతి చెందారు.
ఏప్రిల్ 2న ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా కోర్చోలి అడవుల్లో తెల్లవారు జామున జరిగిన ఎదురు కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పోలీస్‌లు ఆధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
గత వారం కూడా అడవుల్లో తుపాకీ మోతలు మోగాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్న క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు కాల్పులు జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ వెల్లడించారు.
నెలరోజుల వ్యవధిలోపే జరిగిన 4 ఎన్ కౌంటర్లలో 26మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్లు నీటి పరివాహక ప్రాంతాలతోపాటు ఉదయం సమయాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్లలో చనిపోయిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. ఎండాకాలం మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీస్తుందని చెప్పవచ్చు.