తరాలు మారుతున్న ఆ గ్రామస్తుల అనాదిగా వస్తున్న ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తున్నారు. రవాణా సౌకర్యం ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఎడ్ల బండి పై జాతరకు తరలి వెళ్తున్నారు. ఏటా సంక్రాంతి పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామస్తులు 60 ఏళ్లుగా పాటిస్తున్న ఆచారము దాని ప్రత్యేకత ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కన్నపేట మండలం జనగామ గ్రామస్తులు ఏటా సంక్రాంతి పండుగ రోజున హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర ఉత్సవాలకు బండ్లపై తరలి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. 


గ్రామానికి చెందిన కాసర్ల కొత్తకొండ ఆయన కుమారుడు శ్రవణ్ కుమార్ ఇద్దరు సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి ఉపవాసం చేస్తారు. సంక్రాంతి రోజున గ్రామస్తులు తమ ఎడ్ల బండ్లను అందంగా ముస్తాబు చేస్తారు. అనంతరం వాటిని గ్రామంలో డప్పు చప్పులతో ఊరేగిస్తారు. వీరభద్ర స్వామికి ప్రతీకగా భావించే కొత్తకొండ అతని కుమారుడు శ్రవణ్ కుమార్ వీరభద్రుని దండకాలు చదువుతూ ఖడ్గాలు ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా భక్తులు వీరభద్ర స్వామికి  చెల్లించే కానుకలను కొత్తకొండకు అప్పగిస్తారు. వాటిని స్వీకరించి భక్తులను ఆశీర్వదిస్తారు. అనంతరం ఎడ్లబండ్లపై గ్రామస్తులంతా కొత్తకొండకు జాతరకు బయల్దేరి వెళ్తారు. అక్కడ ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదక్షణ చేసి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ సాంప్రదాయాన్ని గత 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం గ్రామస్తులు ప్రత్యేకించి ఎడ్లబండ్లను ఎద్దులను కొనుగోలు చేస్తారు. జాతర కోసం వాటిని పదిలంగా భద్రపరచుకుంటారు.


భక్తుల అగ్నిగుండాల ప్రవేశం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగిసాయి. అగ్ని గుండాలు దాటితే ఈతి బాధలు, సంస్కార దోషములు తొలగి, మహోవాక్కాయ కర్మల నుండి విముక్తి పొందుతామని భక్తుల నమ్మకం. దుష్ట శక్తుల నుండి సమస్త గ్రహ దోషాల నుండి విముక్తిని కలిగించి తమను తమ కుటుంబాలను చల్లగా చూడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భక్తులు అగ్నిగుండాలను దాటారు.


శ్రీశైలంలో అంబరాన్నంటిన సంబరాలు
శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీభ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి రావణ వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణవాహనాదీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు రావణవాహానంపై శ్రీస్వామి అమ్మవార్లు క్షేత్రపురవిధుల్లో విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి