హన్మకొండ పరిధి కొత్తూరు జెండా ప్రాంతంలో మురుగును తొలగించే క్రమంలో మ్యాన్ హోల్ లోకి దిగి శుభ్రం చేసిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మ్యాన్ హోల్ లో ఓ వ్యక్తి  దిగి సిబ్బంది శుభ్రం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ విషయంపై వరంగల్ మేయర్, కమిషనర్ లు తీవ్రంగా పరిగణించారు. దాంతో ఈ ఘటనకు బాధ్యులైన సంబంధిత శానిటరీ ఇన్ స్పెక్టర్ భాస్కర్, జవాన్ రవి లను సస్పెండ్ చేవారు. ఈ మేరకు కలెక్టర్, ఇంఛార్జి కమీషనర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. 


ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదు: నగర మేయర్ గుండు సుధారాణి 
డ్రైనేజీ లోకి దిగి వ్యర్థాలను చేతులతో తొలగించడం విచారకరమని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు మేయర్ గుండు సుధారాణి. జీడబ్ల్యూ ఎంసీ వ్యాప్తంగా అత్యాధునిక పారిశుధ్య విధానాలు అవలంభిస్తున్నాం అన్నారు. కార్మికులతో ఇలాంటి అమానవీయ పనులు చేయించడానికి వీలు లేదన్నారు. చట్టాలను అధికారులు గౌరవించాలని సూచించారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బల్దియా వ్యాప్తంగా అన్ని డివిజన్ లలో పర్యవేక్షణను పటిష్టం చేస్తామని చెప్పారు.


గతంలో కొన్ని ప్రాంతాల్లో మురుగు శుద్ధి చేసేందుకు, పైపులు క్లీన్ చేసేందుకు మ్యాన్ హోల్ లోకి దిగి కార్మికులు చనిపోవడం తెలిసిందే. కార్మికుల రక్షణ ముఖ్యమని, ప్రతి చోటా కార్మికులను అలా పనిచేయించకూడదని.. టెక్నాలజీని సైతం వినియోగించి కొన్ని పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల, మంత్రులు సూచించారు. కానీ కొన్ని చోట్ల ప్రమాదకరమైన మ్యాన్ హోల్స్ లో కార్మికులతో పని చేపించడంపై నేటికి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం, విమర్శలు రావడంతో అందుకు బాధ్యలైన ఇద్దరిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.