వరంగల్ (మహబూబాబాద్): పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు పట్టణంలో జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. తొర్రూరును మున్సిపాలిటీ చేసుకున్నం. ఇప్పటికే రూ.152 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నం. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఇచ్చిన రూ.50 కోట్లతోపాటు అమృత్ పథకం కింద వచ్చిన రూ.25 కోట్ల నిధులు కలిపి మొత్తం రూ.75 కోట్లతో మరింత అభివృద్ధికి, నిరంతర మంచినీటి సరఫరాకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు పట్టణంలో జరిగిన బి అర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. కాంగ్రెస్ పాలనలో తొర్రూరు పట్టణం ఎలా ఉండేది? ఇప్పుడు బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది? బేరీజు వేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రెవిన్యూ డివిజన్ గా, మున్సిపల్ కేంద్రంగా ఉన్నతీకరించిన తర్వాత రూ.152 కోట్లతో 5 ఏళ్ళల్లో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేసినం. ఇంకా చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.25 కోట్లు, మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్లకు తోడు అమృత్ పథకం ద్వారా 24 గంటల పాటు శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందించేలా మంజూరైన రూ.25 కోట్లు కలిపి, ఈ 6 నెలల్లోనే రూ.75 కోట్ల విలువైన పనులు కొత్తగా చేపట్టనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
తొర్రూరు పెద్ద చెరువు అభివృద్ధి, నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం, ఇండోర్ స్టేడియం, ప్రజలందరికీ ఉపయోగపడేలా భారీ కమ్యూనిటీ హాలు, టీచర్స్ కాలనీ నుండి పాల కేంద్రం వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ విస్తరణ, హై మాస్ లైట్ల ఏర్పాటు, అవసరమున్న చోటల్లా డ్రైనేజీ నిర్మాణం, వరద నీటి మళ్ళింపునకు కాలువల నిర్మాణం, బుడగ జంగాలు, ఎస్సీలు, వివిధ కులాల కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, డంపింగ్ యార్డు, స్మశాన వాటిక అభివృద్ధి, సిసి రోడ్లు ఇలా... తొర్రూరు పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, అన్ని హంగులు సమకూరుస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మీ ఆశీర్వాదంతో గెలిచాను, సిఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి నయ్యాను. మీ రుణం తీర్చుకుంటూ, మీరు మెచ్చే , మీకు నచ్చే విధంగా పని చేస్తానని మంత్రి ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు.
మహిళలతో కలిసి ఆత్మీయ సహకపంక్తి భోజనాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో బాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలతో కలిసి, వారికి వడ్డిస్తూ, సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ సందేశాన్ని ఆత్మీయ సమ్మేళనంలో ముందుగా చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఆయన సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉష దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, తొర్రూరు పట్టణ పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి
తొర్రూరులోనే అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేశామని, 726 గృహాలు మంజూరు చేయగా, 412 గృహాలు పూర్తి అయ్యాయయని, రెండు రోజుల్లో వార్డు ల వారీగా పాదర్శకంగా పార్టీలతో ప్రమేయం లేకుండా డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆదేశించారు. ఎక్కడా బద్ నామ్ కావద్దని, చెడ్డ పేరు తెచ్చుకోవద్దని పార్టీ నేతలకు మంత్రి సూచించారు. ఖాళీ స్థలాలు ఉన్న వారికి రెండు దశలుగా గృహ నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున మంజూరు చేయిస్తామని తెలిపారు. దళిత బంధు సంబంధించి గతంలోనే 500 మందికి నిధులు ఇచ్చామని, మరో 500 మంది ఎంపిక వెంటనే చేపట్టాలని చెప్పారు.
ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా కుట్టు శిక్షణ
పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మంది మహిళల ఉపాధి కోసం కుట్టు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రారంభించామని, మూడు విడతల్లో 3 వేల మందికి ప్రభుత్వ నిధులతో శిక్షణ ఇప్పించి, 10వ తరగతి పూర్తి చేసిన వారికి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగావకాశాలు కల్పించబోతున్నామని తెలిపారు. మిగలిన 7 వేల మంది మహిళలకు ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా రూ.10 కోట్ల వెచ్చించి, కుట్టు శిక్షణ ఇప్పించబోతున్నామని, తొర్రూరు మున్సిపాలిటీలో ప్రతి వార్డులో 50 మంది మహిళలను శిక్షణ కోసం ఎంపిక చేయాలని ఇందులో 10వ తరగతి పూర్తి చేసిన వారు విధిగా 25 మంది ఉండాలని కౌన్సిలర్లను, వార్డు ఇన్ చార్జీలను మంత్రి ఆదేశించారు. జులై 1 నుండి 10వ తరగతి వరకు చదువుకున్న యువతకు, కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ప్రకటించారు. కంపెనీ వారే రవాణా సదుపాయాన్ని, భోజన వసతిని కల్పిస్తూ, యువకులకు కూడా నెలకు రూ.12వేల చొప్పున వేతనం అందచేసి శిక్షణ ఇస్తారని ప్రతిభ ఆధారంగా ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు కల్పిస్తారని మంత్రి వివరించారు.
అలాగే ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఎర్రబెల్లి ట్రస్టు చేస్తున్న సేవలను వివరించారు. మంత్రి ఎర్రబెల్లి నిరంతరం తన నియోజకవర్గ ప్రజల కోసం పరితపిస్తారని, అభివృద్ధే ఊపరిగా పని చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.