తెలంగాణలో మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డును చూపిస్తేనే అనుమతిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులు కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్‌ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. జిరాక్స్‌, స్కాన్డ్‌ కాపీ చూపిస్తే అనుమతించబోమని తెలిపారు. 


ఇప్పటికే ఎంసెట్ పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా, షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ ప్రవేశ‌ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెషన్లలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు.


మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా పరీక్షలకు రాష్ట్రంలో 132 అబ్జర్వర్లను నియమించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 84 మంది అబ్జర్వర్లు విధులు నిర్వరిస్తారు. ఉదయం సెషన్‌లో 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్‌లో 1:30 గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు.


ఎంసెట్‌కు దరఖాస్తులు ఇలా..



గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు..
ఎంసెట్ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు ప‌రీక్షా స‌మయానికే ఒక గంట ముందుగానే చేరుకోవాల‌ని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ హాల్‌టికెట్‌పై పొందుప‌రిచిన నిబంధ‌న‌ల‌ను త‌ప్పనిస‌రిగా పాటించాల‌ని ఆదేశించారు. విద్యార్థుల‌కు కేటాయించిన తేదీ, స‌మ‌యంలోనే ప‌రీక్షల‌కు అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ఆ స‌మ‌యానికి అటెండ్ కాక‌పోతే.. ఇత‌ర సెష‌న్లకు అనుమతించే ప్రస‌క్తే లేద‌ని ఆయన స్పష్టం చేశారు.


ఎంసెట్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు, 137 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు!
తెలంగాణ ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్‌ పరిశీలకుడిని నియమించారు. మే 10 నుంచి ఎంసెట్‌ ప్రారంభం కానుండటం, ఆ తర్వాత నెలంతా ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఎంసెట్ పరీక్ష పర్యవేక్షణకు గతంలో రెండు నుంచి అయిదు కేంద్రాలకు ఒక ఫ్లయింగ్‌ పరిశీలకుడు ఉండగా.. ఈ సారి సిట్టింగ్‌ స్క్వాడ్‌ తరహాలో పనిచేసేలా ప్రతి సెంటర్‌కూ ఓ పరిశీలకుడు ఉండనున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ఎంసెట్‌ రెండు విభాగాలకు కలిపి 54 వేల వరకు దరఖాస్తులు పెరిగాయి. ఇంజినీరింగ్‌కు 29 పరీక్షా కేంద్రాలు పెంచారు.


ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఆన్‌లైన్‌ పరీక్షలైనందున అన్ని చోట్లా కంప్యూటర్లు సక్రమంగా పనిచేసేలా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.


కొత్తగా బయోటెక్నాలజీ కోర్సు..
ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ ప్రాంగణంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో బీటెక్‌ బయో టెక్నాలజీ బ్రాంచీని ప్రవేశ పెడుతున్నారు. ఏడాదికి రూ.లక్ష ఫీజు ఉండనుంది. అదేవిధంగా కొత్త కోర్సుల కోసం ప్రైవేట్‌ కాలేజీల దరఖాస్తులు ఏఐసీటీఈ పరిశీలనలో ఉన్నాయి.  


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..