Mahabubabad Farmers Attack: యూరియా కోసం రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూరియా కోసం గంటల తరబడి లైన్ లో వేచివున్న రైతులకు యూరియా లేదని చెప్పడంతో కోపోద్రిక్తులయ్యారు. ఆగ్రహంతో ఎరువులు అమ్మే షాపుపై దాడి చేశారు. రాళ్ల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఆ షాపు గోదాంలో ఉంచిన యూరియా బస్తాలను ఎత్తుకెళ్లారు.  

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ షాపు ముందు యూరియా కోసం సుమారు 4 వందల మంది ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఆశగా నిద్రాహారాలు మానేసి షాపు ఎదుటే నిలబడి ఉన్నారు. అయితే సాయంత్రానికి యూరయా అయిపోయిందని గ్రోమోర్ షాపు యజమాని మూసేసి వెళ్లిపోయాడు. 

ఉదయం నుంచి కాళ్లు వాచిపోయేలా నిలబడి ఉన్న రైతులు ఆ మాట విన్నాక ఆగ్రహంతో ఊగిపోయారు. ఎరువులు లేవని చెప్పడం ఏంటని నిలదీశారు. కోపాన్ని పట్టలేని రైతులు కొందరు షాపుపై రాళ్ల దాడి చేశారు. షాపు ఎదుట ఉన్న చెక్కలకు నిప్పు పెట్టారు. 

ఇన్ని చేసిన ఆగ్రహం చల్లారని రైతులు షాపునకు అనుబంధంగా ఉన్న గోదాంపై దాడి చేశారు. అందులో ఉన్న ఎరువుల బస్తాలు మోసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటిపోయందని గ్రహించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. 

గోదాం నుంచి ఎరువులు ఎత్తుకెళ్లిపోతున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు రైతులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్‌కు దిగారు. ఉద్రిక్తతను తగ్గించేందుకు కొందు పోలీసులు రైతులతో మాట్లాడి వారిని శాంతింపజేయడంతో వివాదం ముగిసింది.  చర్చల్లో భాగంగా గోదాంలో ఉన్న యూరియా పంపిణీ చేస్తామని రైతులకు పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో అప్పటికప్పుడు రైతులను క్యూలో నిలబెట్టి ఒక్కోరైతుకు ఒక్కో బస్తా పంపిణీ చేశారు.