Kavitha New Party: తెలంగాణ రాజకీయాల్లో గత పాతికేళ్లలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని రాజకీయ పరిణామాలు సరికొత్త శకానికి తెరలేపగా, మరికొన్ని టీ కప్పులో తుపాను మాదిరి సమసిపోయాయి. పాతికేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అదే మాదిరిగా ఇప్పుడు ఆయన కుమార్తె కవిత, తండ్రి స్థాపించిన భారతీయ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి, ఆయన మార్గంలోనే నడుస్తూ కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారా అనే చర్చ మొదలైంది. కేసీఆర్ ప్రస్థానం ఉద్యమపరంగా, రాజకీయపరంగా ఒక చరిత్ర సృష్టించింది. అదే రీతిలో కల్వకుంట్ల కవిత ప్రస్థానం తెలంగాణ రాజకీయాల్లో ఎలా ఉండనుందనే చర్చ నడుస్తోంది. వీరిద్దరి రాజీనామాల పర్వానికి దారితీసిన పరిస్థితులపై ఈ కథనం విశ్లేషిస్తుంది.

టీడీపీకి రాజీనామా చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

2001 వరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ నేతగా మాత్రమే గుర్తింపు పొందారు. అయితే తన రాజకీయ సామర్థ్యంతో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులను అలంకరించారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించలేదన్న భావన, మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతోనే కేసీఆర్ టీడీపీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతారు. మరికొందరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పదవులను త్యాగం చేశారని అంటారు. ఏది ఏమైనప్పటికీ, టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి, 2001లో కేసీఆర్ తెలంగాణ సాధనే తన లక్ష్యమని ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. అప్పటి నుంచి ఆయన ఉద్యమ కార్యాచరణలో, ఎన్నికల రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. ఇలా ఆనాడు కేసీఆర్ టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసినా తెలంగాణ రాజకీయాల్లో తనదైన చరిత్రను లిఖించుకున్నారు.

2006 నుంచి ప్రారంభమైన కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం

అమెరికాలో ఉన్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత 2006లో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అదే ఏడాది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ అనే లక్ష్యంతో తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించారు. బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేయడంలో ఆమె కృషి చేశారు. 2006 నుంచి తెలంగాణ వచ్చే వరకు అంటే 2014 వరకూ అనేక ఉద్యమ కార్యాచరణలలో ఆమె భాగస్వామిగా ఉన్నారు. 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఉంటూనే ఇటీవలే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, పార్టీ లైన్‌కు భిన్నంగా తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఆమె చేశారు. అయితే పార్టీ సీనియర్ లీడర్ హరీశ్ రావు, మరో కీలక నేత సంతోష్ రావు తనపై కుట్రలు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి వారే కారకులని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో పార్టీ అధ్యక్షుడు, తండ్రి అయిన కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె తన పదవులకు రాజీనామా చేశారు. ఇక తన కార్యాచరణ తనది అని ఆమె మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

తండ్రి బాటలో తనయ నడుస్తారా?

ఆనాడు కేసీఆర్ రాజీనామా వ్యవహారం, ఈనాడు కవిత రాజీనామా వ్యవహారం చూస్తే, ఇద్దరూ మరో కొత్త రాజకీయానికి తెరలేపేందుకే అన్న పోలిక స్పష్టంగా తెలుస్తోంది. ఆనాడు కేసీఆర్ టీడీపీలో అవమానాలు భరించలేక, పార్టీలో గుర్తింపు లభించకపోవడం, మంత్రి పదవిని ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినట్లు చెబుతారు. కవిత కూడా అదే రీతిలో పార్టీలో అంతర్గత సంక్షోభం, నాయకత్వంపై ఆగ్రహంతోను, తనకు సరైన గుర్తింపు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారన్న కారణాల వల్లే బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం జరిగిందని తెలుస్తోంది.

అయితే ఆనాడు కేసీఆర్‌కు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనే ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం వల్ల కొత్త పార్టీ పెట్టి లక్ష్యాన్ని సాధించగలిగారు. కవిత తన భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వకపోయినా, 'సామాజిక తెలంగాణ' అనే లక్ష్యం పెట్టుకుని పని చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తన తండ్రి మాదిరిగానే పార్టీని స్థాపించి, ఆ పార్టీ ద్వారా సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాల వారికి సమాన వాటా అనే నినాదంతో ముఖ్యంగా బీసీ వర్గాలను ఆకట్టుకునేలా కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది. అయితే తండ్రి బాటలో నడిచి ఆమె సక్సెస్ అవుతారా, ప్రజలు కవిత రాజకీయ ప్రస్థానానికి మద్దతుగా నిలుస్తారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.