Errabelli on Warangal Floods : వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరదల్లో మృతిచెందిన వారికి రూ.4 లక్షల పరిహారం అందించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. వరదల నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. దాదాపు వరద నష్టం 414 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎర్రబెల్లి తెలిపారు. క్షతగాత్రులకు 60 వేల నుంచి 2 లక్షల వరకూ పరిహారం ఇవ్వనున్నట్లు వివరించారు. లోతట్టు కాలనీల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన చెప్పారు. వరదల ఉద్ధృతికి 207 పూర్తిగా... 480 ఇళ్లు పాక్షికంగానూ దెబ్బతిన్నట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. రహదారులు, కల్వర్టులు, కాలువలకు 177 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఎప్పటికప్పుడు వరదలపై ఆరా తీసి అడిగినన్ని బృందాలను పంపారని వివరించారు. అధికారులంతా బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. ఈ క్రమంలోనే వ్యాధులు ప్రబలకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదలు తగ్గాక పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు.


వరద సృష్టించిన బీభత్సం కళ్ళముందే కదులుతుండగానే.. ఓరుగల్లులో భద్రకాళి చెరువు పరివాహక ప్రాంతాల ప్రజలు ఒకసారిగా హాడలిపోయారు. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న తరుణంలో భద్రకాళి చెరువుకు గండి పడిందన్న వార్తతో ఆందోళనకు గురయ్యారు. చెరువుకు పోటెత్తిన వరదతో పోతన నగర్ వైపు ఉన్న చెరువు కట్టకు గండి పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడ నుంచి వరద పోటెత్తింది.


నీళ్లు దిగువ కాలనీలను చుట్టకముందే అప్రమత్తమమైన అధికారులు.. దిగుప్రాంత కాలనీవాసులను ఖాళీ చేయించారు. పోతన నగర్, సరస్వతి నగర్, కాపు వాడ ప్రజలతోపాటు రంగపేట వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్ కార్పొరేటర్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఘటన స్థలన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. 


చెరువు గండి పడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేపట్టారు. జేసీబీలతో భద్రకాళీ బండ్ నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాలువలోకి నీటిని మళ్ళించారు. చెరువుకు గండి పడిన ప్రాంతానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మరోవైపు భద్రకాళి చెరువు కట్ట పరిస్థితిని బిజెపి, కాంగ్రెస్ నేతల సైతం పరిశీలించారు. 


రాష్ట్రంలో భారీ వర్షాలతో చిగురుటాకుల వనికిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటోంది. శుక్రవారం నుంచి వరుణుడు కరుణించినా... వరదలు కొనసాగుతుండడంతో పలు లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాలాల నుంచి కొట్టుకచ్చిన చెత్తాచెదారంతో వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. హనుమకొండ, మహబుబ్ నగర్ లోను ఇదే పరిస్థితి ఉండగా ఇళ్లల్లోకి చేరిన బురదతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. 


ఇక ములుగు జిల్లాలోని మూరంచపల్లిలో ఏ ఇంట చూసిన వరద నింపిన విషాదమే కనిపిస్తోంది. ఊరిని ముంచెత్తిన భారీ వరదల నుంచి ప్రాణాలతో బయటపడిన గ్రామస్తులు తమ ఇళ్ల ప్రస్తుత పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్న కాస్త గూడు వరదల దాటికి దెబ్బ తినడంతో ఇట్లా బతికేది అంటూ ఆందోళన చెందుతున్నారు. బాధితులను పలువులు ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించి ధైర్యం చెప్పినా వరద తాలూకు భయాల నుంచి వారు ఇంకా బయటపడలేకపోతున్నారు. 


మరోవైపు ఆవాసం కోల్పోయిన బాధితులకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, మెడికల్ కిట్లు, మంచినీరు అందిస్తున్నా.. గతేడాది అనుభవాలతో ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే ఇంత నష్టం వాటి లేదు కాదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాతావరణ శాఖ ముందస్తుగానే అప్రమత్తం చేసినా... ప్రభుత్వం ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదంటూ మండి పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ ఆరోపిస్తున్నారు.