ఏ మొహం పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తారని చాలా మంది ప్రశ్నించారని అయితే ఆరువేల కోట్లు అభివృద్ధి పనులు శంకుస్థాపనకు వచ్చారని అన్నారు ఎంపీ బండి సంజయ్. కేంద్రం చేపట్టే వివిధ ప్రాజెక్టుల వివరాలు చెబుతూ వాటిని ఇచ్చిన మొహం పెట్టుకొని మోదీ ఈ వరంగల్ వచ్చారని అన్నారు. మరి కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు బండియ సంజయ్. ఏం చెప్పుకోవాలో మొహం చెల్లకే కేసీఆర్ ప్రధాని మోదీ టూర్‌ను బహిష్కరించారని ఆరోపించారు.
హన్మకొండలో జరిగిన మీటింగ్‌లో ఎంపీ బండి సంజయ్ భావోద్వేగంతో ప్రసగించారు. తనకు భారతీయ జనతాపార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని మోదీ లాంటి వ్యక్తి కంట్లో పడితే చాలు అనుకునే తనకు ఆయన పక్కనే కూర్చొనే అదృష్టం వచ్చిందన్నారు. తన భుజాన్ని తట్టి ప్రోత్సహించడం కంటే గొప్ప గుర్తింపు ఇంకా ఏం కావాలని ప్రశ్నించారు సంజయ్.
సంజయ్... అనిపిలిపించుకోవాలని చాలా ఏళ్లుగా అనుకునేవాడినని అది నెరవేరిందని ఆ అవకాశం కల్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇకపై కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ విజయం కోసం కృష్టి చేద్దామని సభా వేదికగా సంజయ్ పిలుపునిచ్చారు.
ప్రపంచమే బాస్‌గా గుర్తించిన ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడల్లా కేసీఆర్‌కు ఏదో సమస్య వస్తుందన్నారు. ఓసారి జ్వరమని... ఇంకోసారి కరోనా అని సాకులతో పర్యటనకు డుమ్మా కొడుతున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి చెవల్లో రక్తం వచ్చేలా జై మోదీ నినాదం చేయాలని సంజయ్ కోరారు. అక్కడి వారంతా నిలబడి ఒక్కసారిగా జై మోదీ నినాదాలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనను కూల్చి బీజేపీ పాలన రావాలంటే కేంద్రం సహకారం అవసరమని సభలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల విజ్ఞప్తి చేశారు. కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి ప్రజలకు కూడ విముక్‌తి కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో కొందరు పనిగట్టుకొని బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనంటూ విషప్రచారం చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాత్రమే లోపాయికారి ఒప్పందంతో రాజకీయం చేస్తున్నాయన్నారు ఈటల. మూడేళ్లుగా వీళ్లు అదే బాటలో కొనసాగుతున్నారని అన్నారు. మోదీ వచ్చి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం శుభపరిణామమని అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.