Draupadi Murmu TS Tour: భద్రాచలం రామయ్యను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు, అధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెంట గవర్నర్ తమిళిసై, మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రధాన ఆలయంలో సీతారాముల వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అలాగే భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రసాద్ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 






రామప్పకు వెళ్లనున్న రాష్ట్రపతి..


భద్రాచల రామయ్య దర్శనం తర్వాత రాష్ట్రపతి వరంగల్ రామప్ప ఆలయానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే రామప్ప గార్డెన్‌లో జర్మన్‌ టెంటును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విశాలమైన స్టేజీని నిర్మించారు. ఇక్కడ సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రసాద్‌ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల ఆధ్వర్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి రూ.62 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు సేఫ్‌ హౌజ్‌లను ఏర్పాటు చేశారు. ఒకదానిలో కార్డియాలజిస్టు, జనరల్‌ ఫిజీషియన్‌, అనస్తీషియా డాక్టర్‌, ఆక్సిజన్‌ సిలిండర్స్‌ అందుబాటులో ఉంటాయి. మరో సేఫ్‌హౌస్ లో కంటి వైద్యుడు, జనరల్‌ మెడిసిన్‌, అనస్తీషియా, పిల్లల వైద్యులతోపాటు ఒక అత్యవసర అంబులెన్స్‌, రక్త నిధి కేంద్రం, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, ఎంఎన్‌వో ఇలా మొత్తం 30 ఉంటారు. వారందరినీ జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య పర్యవేక్షిస్తారు.


రామప్ప పరిసరాల్లో కేంద్ర భద్రత సిబ్బంది భారీ భద్రతా ఏర్పాట్లు


జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జి.పాటిల్‌ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పర్యటనకు 547 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర భద్రతా సిబ్బంది, ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి తప్పిదాలు జరుగకుండా మంగళవారం ఉదయం, సాయంత్రం హెలిప్యాడ్‌ స్థలం నుంచి ఆలయం వరకు వాహన శ్రేణితో రిహార్సల్‌ చేశారు. ఐజీ నాగిరెడ్డి, ఇంటలీజెన్స్‌ ఎస్పీ నారాయణనాయక్‌, 5వ బెటాలియన్‌ అధికారులు రామప్పకు చేరుకుని మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఎయిర్‌ ఫోర్స్‌ అదికారులు రామప్పలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ స్థలంలో ల్యాండింగ్‌ రిహార్సల్‌ చేశారు. చుట్ట ప్రక్కల ప్రదేశంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.


చింతలపల్లి కళాకారులతో కొమ్ము నృత్యం


ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ కొమ్ము నృత్య కళాకారులకు అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రపతి సమక్షంలో వారు ప్రదర్శన ఇవ్వనున్నారు. చిన్నబోయినపల్లికి సమీపంలో ఉన్న గూడానికి చెందిన కళాకారులను ఐటీడీఏ పీవో అంకిత్‌ పర్యవేక్షణలో రామప్పకు తీసుకువచ్చి రిహార్సల్స్‌ చేశారు.