Gandra Venkata Ramana Reddy: వరంగల్ ( జయశంకర్ భూపాలపల్లి జిల్లా )లో పారదర్శకంగా అర్హులకు లాటరీ పద్ధతి ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక అయిన 544 మంది లబ్ధిదారుల సమక్షంలో డ్రా, లాటరీ ప్రక్రియ ద్వారా బ్లాక్, ఫ్లోర్ లను సోమవారం స్థానిక ఇల్లందు క్లబ్ హౌస్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి కేటాయింపులు చేశారు.
ఈ సందర్భంగా భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 100% సబ్సీడితో పూర్తి ఉచితంగా పేదలకు అందిస్తున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే అభ్యంతరాలు తెలియజేస్తే విచారణ చేపట్టి ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం కలెక్టర్ వద్ద ఉంటుందన్నారు.
ప్రజల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా బ్లాక్ లో ఫ్లోర్లలో ఇండ్లు కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మంచిరోజు చూసుకుని త్వరలో లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇంటిలో గృహప్రవేశం చేయాలని ఆయన సూచించారు. భూపాలపల్లి పట్టణంలో మరో 416 ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని, త్వరగా ఆ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి లబ్ధిదారుల ఎంపిక చేసి అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో రెండు ఫేజ్ లలో 960 ఇండ్ల నిర్మాణ పనులు ప్రభుత్వం చేపట్టిందని, వీటిలో 544 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసామన్నారు. మనకు వచ్చిన దాదాపు 5 వేల దరఖాస్తులలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేసి వాటిలో నుంచి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు.
పెండింగ్ లో ఉన్న 416 డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి మరో రెండు నెలల్లో వాటిని సైతం పారదర్శకంగా కేటాయింపులు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన 544 లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు సైతం లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టి.ఎస్. దివాకర్, మున్సిపల్ ఛైర్పెర్సన్ వెంకట రాణి సిద్దు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, లబ్ధిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూమ్ పథకం, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హౌసింగ్ ప్రాజెక్ట్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గృహాలకు ప్రభుత్వ నుండి నిధులు సమకూర్చి హైదరాబాదు నగరాన్ని మురికివాడలు లేని నగరంగా మార్చాలని ఈ పథక లక్ష్యం. ఈ పథకం ద్వారా 2019, మార్చి 2.72 లక్షల ఇళ్ళు, 2024 నాటికి అదనంగా మరో 3 లక్షల ఇళ్ళను నిర్మించబోతున్నారు
2014, మే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మానిఫెస్టోలో ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకోసం 5.72 లక్షల ఇల్లు (హైదరాబాదులోని 2 లక్షల ఇళ్ళతో సహా) కేటాయించబడ్డాయి. 2016, మార్చి 5న ఎర్రవల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఈ గ్రామం సిద్ధిపేట జిల్లా లోని మర్కూక్ మండలంలో ఉంది.