Telangana News | మధిర: దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి (Bhu Bharati Act) అని, రైతుల భూములు సర్వే చేయించి సరిహద్దులు గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యమన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి చట్టం (Dharani Act) రైతుల హక్కులను కాల రాసిందని, రైతును ఆగం చేసిందన్నారు. మధిర నియోజకవర్గం ములుగుమాడు గ్రామంలో భూభారతి సర్వే పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన తరువాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పది ఎకరాల భూమికి 17 ఎకరాలకు పాస్ బుక్కులు
‘టిఆర్ఎస్ నాయకులు వాళ్లకు కావాల్సిన వ్యక్తులకు భూములు కట్టబెట్టారు. తిరిగి సవరణ చేసే అవకాశం లేకుండా ధరణి చట్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. పది ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలకు పాస్ బుక్కులు ఇచ్చారు. నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు ప్రయోజనం చేకూరేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పినట్టుగా ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపాం. భూ సంస్కరణ ల చట్టంలో భాగంగా రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచింది. దానిని బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టంలోని పార్ట్ బి లో పెట్టింది.. కానీ వాటిపై ఎలాంటి విచారణ చేయలేదు.
బాధితులకు, యజమానులకు న్యాయం చేస్తాంతిరిగి ఆ అసైన్డ్ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపి, అర్హులైన హక్కుదారులందరికీ భూ పట్టాలు ఇచ్చి వారి భూమిలో కూర్చోబెడతామని హామీ ఇస్తున్నాం. భూమిలేని పేదలకు సాగుభూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్ కమిటీలను భూభారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తున్నాం. ఆబాది భూమిని సర్వే చేసే అవకాశం కొత్త చట్టం ద్వారా కల్పించాం. ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. ఎవరు భూములు అమ్మారు. భూ రికార్డుల్లో జరిగిన మార్పులను గ్రామ సభ ద్వారా వివరించడానికి భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుంది.
భూభారతి చట్టం రైతులు, రాష్ట్ర ప్రజలు సాధించిన విజయం. రైతులు భూమికి ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కొలిచి వారికి తిరిగి అప్పగిస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేపడుతున్నాం అని చెబితే ములుగుమాడు ఊరంతా ఈ రెవెన్యూ సదస్సుకు కదిలి వచ్చింది. ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయనుందని చెప్పడానికి ఇది నిదర్శనం. భూభారతి చట్టం మన అందరిదీ. మీరు అవగాహన చేసుకోవాలి, మరో పది మందికి వివరించాలి’ అని భట్టి విక్రమార్క సూచించారు.
భూములకు త్వరలోనే భూధార్ కార్డులు
మనుషులకు ఆధార్ కార్డులు ఉన్నట్లే భూములకు సైతం భూధార్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గులాబీ ప్రభుత్వం ప్రజలను, రైతులను మోసం చేసి భూములు లాక్కుందని, ప్రజా ప్రభుత్వంలో బాధితులకు తిరిగి న్యాయం చేస్తామన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 3500 మంది రెవెన్యూ అధికారులుగా నియమిస్తామని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం ద్వారా విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ధరణి చట్టం వల్ల రైతులకు సమస్యలు వచ్చాయని, భూ భూరతి చట్టంతో అన్నదాతల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.