BRS MLC Kavitha Politics | హైదరాబాద్: బీఆర్ఎస్ లో సంక్షోభం బాగా ముదిరినట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆ పార్టీ సీనియర్ మహిళా నేత కల్వకుంట్ల కవిత పార్టీ ముఖ్య నేతలపై చేస్తోన్న విమర్శలు సంచలనంగా మారాయి. కేసీఆర్ కు లేఖ రాయడం, ఆ తర్వాత తాను రాసిన లేఖ బయటపెట్టిన వారి పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడం, కేటీఆర్ సహా పార్టీలో ఇతర ముఖ్య నేతలు హరీశ్ రావు,సంతోష్ లపై చిట్ చాట్ లో విమర్శలు చేయడం ఆ ఓ వ్యూహంతో సాగుతున్నట్లు అర్థం అవుతుంది. అయితే ఇక కవిత పార్టీలో ఇమడ లేని పరిస్థితుల్లో ఉన్నట్లు ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు చెప్పకనే చెబుతున్నాయి. మరో వైపు ఈ పరిణామాలపై పార్టీ అధినేత కేసీఆర్ సహా, ఇతర నేతలు ఎవరు నోరు విప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో కవిత తన దారి తాను చూసుకుంటున్నట్లేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యూహాత్మక మౌనంలో కేసీఆర్
కవిత లేఖ బయటపడిన నాటి నుండి జరిగిన పరిణామాలపై కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేసీఆర్, మరో ముఖ్య నేత హరీశ్ రావులతో మాత్రమే కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. జూన్ 3వ తేదీన తిరిగి ఆయన తిరిగి రానున్నారు. ఐదో తేదీన కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హజరు కానున్నారు. ఈ నేపధ్యంలో పార్టీలో చెలరేగిన అంతర్గత సంక్షోభం పై ఆయన పెదవి విప్పడంలేదు. ఆయన దూతలుగా రాజ్య సభ సభ్యుడు దామోదర్ రావు, ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్ రావులు కవితను కలిసినా ఈ సమస్య కొలిక్కి రాలేదు. కేసీఆర్ తోనే తాను అన్ని విషయాలు మాట్లాడతానని కవిత తెగేసి చెప్పడంతో సంక్షోభం మరో మలుపు తీసుకున్నట్లయింది. అయితే కేసీఆర్ నుండి మాత్రం కవితకు ఎలాంటి పిలుపు రాలేదు. దీంతో అసహనంతో ఉన్న కవిత తన కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టినట్లు అర్థం అవుతోంది. అయితే కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హజరవడం అన్నది పార్టీ పరంగా, రాష్ట్ర ప్రయోజనాల పరంగా అతి ముఖ్యమైన విషయమని, ఆ తర్వాతే కవిత ఇష్యూపై కేసీఆర్ దృష్టి సారిస్తారని గులాబీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
కొత్త కార్యాలయం ద్వారా కవిత సరికొత్త సందేశం
కవిత లేఖ బయటపడటం,ఆ తర్వాత చిట్ చాట్ లో పార్టీ నేతలపై విమర్శలు చేసిన కవిత అంతటితో ఊర్కోలేదు. తన జోలికి వస్తే ఊర్కోనని చెప్పిన కవిత అందుకు తగ్గట్టుగా తన కార్యాచరణను ప్రారంభించారు. కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఆమె తెలంగాణ జాగృతిని పటిష్టం చేసే చర్యలు చేపట్టారు. సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. సింగరేణికి సంబంధించి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. ఆ తర్వాత తాజాగా బంజారా హిల్స్ లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతీరావు ఫూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఫ్రో. జయశంకర్ ఫోటోలు తప్ప మరే ఇతర బీఆర్ఎస్ నేతల ఫోటోలు పెట్టకపోవడం విశేషం. దాంతో తనకు రాజకీయ ప్రేరణగా నిలిచిన నేతలనే తన కార్యాలయంలో పెట్టినట్లు అర్థం అవుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా తాను ఎవర్నీలెక్క చేసేది లేదన్న సంకేతాలు తద్వారా పంపినట్లయింది. కొత్త కార్యాలయం పెట్టడం ద్వారా ఇక తగ్గేదే లేదని తాడో పేడో తెల్చుకునేందుకు తాను సిద్ధమేనని గులాబీ పార్టీకి సందేశం ఇచ్చినట్లు ఉంది.
తన ఏజెండా ఏంటే తేల్చి చెప్పిన కవిత
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతిని ఎలుగెత్తి చాటడం , తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పని చేసింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాగృతి సంస్థ కొంత నెమ్మదించింది. అయితే ఆ తర్వాతి పరిణామాలు, లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లడం, జైలు నుండి తిరిగి వచ్చాక పార్టీలో తన ప్రాముఖ్యత తగ్గినట్లు అర్థం చేసుకున్న కవిత అందుకు తగినట్లు తన కార్యాచరణ మార్చుకున్నారు. ఆ దిశగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనర్టీ, మహిళా సమస్యలపై జాగృతి పని చేసేలా ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు.
పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఆమె మాటల్లో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే.. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే, తెలంగాణ జాగృతి మరో కన్నుగా ఉంటుందని చెప్పడం. ఈ మాటలు లోతుగా ఆలోచిస్తే చాలా అర్థాలు కనపడతాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, బంగారు తెలంగాణ అన్న లక్ష్యాలతో పార్టీ చీఫ్ కేసీఆర్ బీఆర్ఎస్ ను నడిపించారు. ఇక జాగృతి ద్వారా సామాజిక ఉద్యమాలను చేస్తోన్న జాగృతి రెండో కన్నుగా కవిత చెప్పడం చిన్న విషయం కాదు. అంటే బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ ఏర్పడ లేదన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ, ఆ లక్ష్యంతోనే జాగృతి పని చేస్తుందన్న తన ఎజెండాను ఫిక్స్ చేశారు కవిత.
కవిత రెండు కళ్ల సిద్ధాంతంతో బీఆర్ఎస్ చీఫ్ కు సంకటమే!
కేసీఆర్ నాయకత్వం తప్ప మరో నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్న కవిత మరో అడుగు ముందుకేసి ఇవాళ చేసిన కామెంట్ బీఆర్ఎస్ చీఫ్ కు తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉంది. బీఆర్ఎస్ కేసీఆర్ కు ఓ కన్ను అయితే సామాజిక తెలంగాణ కోసం పోరాడే జాగృతి సంస్థ మరో కన్ను అని వాఖ్యానించారు. అంటే బీఆర్ఎస్ పార్టీతో సరి సమానంగా జాగృతి సంస్థను పోల్చి చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్య ద్వారా తన తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్ పైనే రెండు కళ్ల సెంటిమెంట్ ప్రయోగించారు. అంటే ఏ కన్ను పోగొట్టుకోవడానికి కేసీఆర్ సిద్ధపడరన్న సందేశం అటు గులాబీ నేతలకు, ఇటు ప్రజలకు ఇచ్చినట్లయింది. అంతే కాకుండా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ కవిత, జూన్ 4వ తేదీన మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా కేసీఆర్ ను ఇబ్బందిపెట్టే చర్య అనే చెప్పాలి.
గతంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానని చెప్పిన కేసీఆర్ మనసు మార్చుకుని కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈ నెల ఐదో తేదీన హజరు కావాలని నిర్ణయించుకున్నారు. కమిషన్ ఎదుట ఏం మాట్లాడాలన్న అంశంపైన విస్తృతంగా హరీశ్ రావు సహా సాగు నీటి రంగ నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కాళేశ్వరం పై ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కలిగిస్తోన్న అపోహలను కమిషన్ వేదికగా తొలగించాలన్న వ్యూహంతో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హజరవ్వాలని నిర్ణయించారు. జూన్ 4న కవిత తలపెట్టిన మహా ధర్నా కేసీఆర్ వ్యూహానికి భిన్నంగా సాగడం విశేషం. దీనిపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
కాళేశ్వరం కమిషన్ ఎదుట హజరు తర్వాతే కవిత విషయంలో, కేసీఆర్ ఓ నిర్ణయంకు రానున్నారా ?
పార్టీలో ముఖ్యనేతగాఉన్న కవిత గత కొద్ది రోజులుగా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న చర్చ గులాబీ పార్టీలో విస్తృతంగా జరుగుతోంది. దీనిపై అదే ఇతర నేతలు ఎవరైనా ఇలా మాట్లాడి ఉంటే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ షోకాజ్ నోటీసులు ఎందుకు పంపలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ బయటపడటం తప్ప కవిత మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు , మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన వాటికి ఆధారాలుండవు, ఏ ఆధారం లేకుండా ఎలా షోకాజ్ నోటీసులు జారీ చేస్తారన్నది మరి కొందరి నేతల ప్రశ్న. కవిత సైతం మీడియా సమావేశంలో పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడకుండా, కేవలం చిట్ చాట్ ద్వారా మాత్రమే తన అభిప్రాయాలను వ్యూహాత్మకంగా వెళ్లడిస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అమెరికాలో ఉన్నారని, జూన్ 3వ తేదీన కేటీఆర్ హైదరాబాద్ వస్తారని, అదే రీతిలో జూన్ ఐదో తేదీన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హజరుకానున్నారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హజరు తర్వాతే కవిత విషయం పార్టీలో చర్చించి చర్యలు తీసుకోవడమా లేక పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని చల్లార్చే చర్యలు తీసుకోవడమో చేస్తారని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ఆలోగా జూన్ 4వ తేదీన జరిగే మహా ధర్నాలో కవిత ఏం మాట్లాడతారు ? పార్టీఅ అంతర్గత అంశాలు ఈ వేదికపై ఎత్తుతారా ? అన్న ఉత్కంఠ నెలకొంది.