వరంగల్: అర్హులైన నిరుపేదలు, లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కొందరు మహిళలు ఊరుకో అక్కా అంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఓదార్చారు. 

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని రెడ్డి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అక్కడున్న మహిళలు, కార్యకర్తలు  ఎమ్మెల్యే యశస్విని రెడ్డిన ఓదార్చారు.

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఇందిరమ్మ ఇండ్లు. దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా ఇదివరకే విడుదల చేసింది. తొలి విడత కింద లబ్దిదారులకు రూ.1 లక్ష మేర ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ చేసింది. దశలవారీగా లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్థికసాయం చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.