Jayashankar Bhupalapall: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సీఎం రేవంత్ మేడిగడ్డ పర్యటన వేళ గ్రే హౌండ్స్ బలగాల కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ మృతి చెందాడు. కాటారం మండలం నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల‌ కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తాకి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడు. 


వన్య ప్రాణులు రాకుండా ఉండేందుకు ఈ ఉచ్చును ఏర్పాటు చేశారు. ఆ విషయం తెలియక కానిస్టేబుల్ ఆప్రాంతంలో తనిఖీలు చేస్తూ ఆ తీగను పట్టుకున్నారు. షాక్‌కి గురై కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని 108 వాహనంలో భూపాలపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.


గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఎ. ప్రవీణ్ కుమార్ మృతి చెందడం పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. రేవంత్ రెడ్డి స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించారు. అలా ఉచ్చు వేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానిస్టేబుల్ మృతిపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. 


ఈ ఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు సమర్పించాలని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఎమ్.సి.పర్గైన్ ను మంత్రి ఆదేశించారు. అడవి జంతువులను వేటాడేందుకు వేటగాళ్ళు విద్యుత్ తీగలు అమర్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను సేకరించి అందించాలని మంత్రి సూచించారు. తద్వారా వారు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. వన్యప్రాణులను వేటాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అటవీ అధికారులను ఆదేశించారు.