Kaleswaram News: కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేరుగా పరిశీలించనున్నారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన రేపు(ఫిబ్రవరి 12, 2024 మంగళవారం ) మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు. బ్యారేజీలో నిర్మాణ లోపాలు, కుంగుబాటుకు కారణాలను అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున రావడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మరింత అప్రమత్తమయ్యారు


మేడిగడ్డ సందర్శన
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోభాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. మంగళ వారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కలిసి ఆయన స్వయంగా బ్యారేజీని పరిశీలించనున్నారు. ప్రజల సమక్షంలోనే అధికారులు  బ్యారేజీ దెబ్బతినడానికి  కారణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth ReddY)కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించనున్నారు. నేడు(ఫిబ్రవరి 12, 2024 సోమవారం) శాసససభలో నీటిపారుదలశాఖపై  శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం... అందులో మేడిగడ్డ లోపాలను ప్రత్యేకంగా ఎత్తిచూపనుంది. నీటిపారుదలశాఖలో అవినీతి, అక్రమాలపై చర్చించనుంది.సభలో తాము చెప్పినవన్నీ నిజాలే అని నిరూపించేందుకే ఎమ్మెల్యేల బృందంతో  సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శించనున్నారు. కేవలం పేపర్ పై మాటలు చెప్పడం కాదని....తాము చేసిన ఆరోపణలను రుజువులతో సహా నిరూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గత సమావేశాల్లోనే సవాల్ విసిరారు. నీటిపారుదలశాఖపై జరిగే చర్చలో ప్రతిపక్షనేత కేసీఆర్(KCR) సైతం పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరారు. మేడిగడ్డ సందర్శనకు  కేసీఆర్ తోపాటు  బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలంతా రావాలని ఆయన రేవంత్ పిలుపునిచ్చారు. 
కట్టుదిట్టమైన భద్రత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా  మేడిగడ్డ సందర్శనకు రానుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతం చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండటంతో మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి , మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే మార్గంలో కల్వర్లులు, రహదారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తుండటంతో  పెద్దెఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అదనపు బలగాలను  మోహరించారు. స్పెషల్ పోలీసులు అటవీప్రాంతంలోని గ్రామాలను జల్లెడపడుతున్నారు. మేడిగడ్డ సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన పేరిట సీఎం రేవంత్ రెడ్డి వారితో నేరుగా ముఖాముఖి నిర్వహించనున్నారు. 
బీఆర్ ఎస్ ఆగ్రహం 
కేసీఆర్(KCR) హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విషం చిమ్మేందుకే  సీఎం రేవంత్ రెడ్డి(Revant Reddy) మేడిగడ్డ సందర్శనకు వస్తున్నారని బీఆర్ఎస్(BRS) నేతలు విమర్శించారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్ట్ లో చిన్నచిన్న లోపాలు సర్వసాధారణమని...అలాంటి వాటిని భూతద్దంలో చూపి ప్రజలను భయపెడుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. కనీసం ఇప్పటి వరకు టెక్నికల్ ఎంక్వైరీ కమిటీ ఎందుకు వేయలేదని వారు ప్రశ్నించారు.  కేవలం ప్రాథమిక విచారణ ఆధారంగానే ప్రాజెక్టుపై రాజకీయం చేస్తూ దీన్ని పక్కన పెట్టే కుట్రలకు ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు కేఆర్ఎంబీ(KRMB)కి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈనెల 13న నల్గొండలో బీఆర్ ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసిన రోజే..కావాలని సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డపై దండయాత్రకు వెళ్తున్నారని వారు ఆరోపించారు.