BRS MLC Kadiam Srihari :
మాజీ మంత్రి తాటికొండ రాజయ్యతో పోటీ పడి జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ సొంతం చేసుకున్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. అయితే నాలుగు నెలల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేయవలసి వస్తుందని తనతో చెప్పారని కడియం శ్రీహరి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దాంతో అధిష్టానం ముందుగానే రాజయ్యను సైడ్ చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. తాను చాలా కాలం తరువాత ఎన్నికల బరిలోకి దిగానని, ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తాను చాలా కాలం తరువాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, తను గెలిపించాలని ప్రజలకు రిక్వెస్ట్ చేశారు. పార్టీ కేడర్ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని, వారు మాట్లాడిన దాని కంటే ఎక్కువగా కృషి చేస్తారన్నారు. బీఆర్ఎస్ విజయం కోసం వీరంతా తమ వంతు పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఎడమోహం పెడమొహంగా ఉన్నవారు పార్టీ అధిష్టానం ఆదేశాలతో కలిసి పోయారని తెలిపారు. ఇంకా ఒకరిద్దరూ అలాగే ఉంటే త్వరలోనే వారు కూడా బీఆర్ఎస్ విజయం కోసం తమతో కలిసిపోతాయరి ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో ముందుకు వెళ్తానని, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడలకు వెళ్లనని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గత పదేళ్లలో మనం తెచ్చుకోవాల్సిన దాని కంటే తక్కువ నిధులు తెచ్చుకున్నాం అని ఆవేదన చెందానన్నారు. ఈసారి ఎన్నికల్లో నెగ్గిన తరువాత గత 10 ఏళ్ల కంటే మరిన్ని నిధులు నియోజకవర్గానికి సాధించుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టాం. ఈ సమయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు రాష్ట్రానికి అవార్డులు ఇస్తూనే, మరోవైపు అభివృద్ధి చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రకటించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం లాంటి ఎన్నో సూచికలలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. పంజాబ్, హరియాణా, మహారాష్ట్రలలో ఎక్కువగా వరి ధాన్యం పండేది.. కానీ కేసీఆర్ పాలనతో ఈరోజు తెలంగాణ ఆ రాష్ట్రాలను అధిగమించి దూసుకెళ్తుందన్నారు. తెలంగాణ 65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లేని వరి ధాన్యం ఇప్పుడు 3 లక్షలకు చేరిందంటే ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనం అన్నారు. పని చేతకాని వాళ్లు లేనిపోని విమర్శలు చేస్తుంటారని, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. తనకు బీఆర్ఎస్ టికెట్ దక్కడంతో ప్రజల నుంచి సానుకూల వాతావరణం కనిపించిందన్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు అభ్యర్థులను ప్రకటించడం సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయమన్నారు.