- కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
- ఓట్లప్పుడు వచ్చే రాజకీయ పార్టీ నాయకుల్ని కాదు
- నిత్యం మీతో ఉంటా మీలో ఒకడిగా ఉంటా
- ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ : కేవలం ఓట్లప్పుడు వచ్చే రాజకీయ పార్టీ నాయకున్ని కాదని, నిత్యం మీతో ఉంటూ, మీలో ఒకడిగా ఉంటానని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే, దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అన్నగా తోడుంటా.. అన్ని వేళలా అండగా నేనుంటానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నారు. హంటర్ రోడ్ అభిరామ్ గార్డెన్స్ లో సోమవారం 30, 31 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ భాస్కర్ మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉన్న, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గా ఉన్నానని అన్నారు. కానీ నాడు నియోజకవర్గ మొత్తానికి కేవలం ఐదు కోట్ల నిధులు కూడా రాని పరిస్థితి ఉండేదని నేడు వేలకోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నామని తెలిపారు.
వరదలు, వానలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారు
పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అన్ని రకాల, అన్ని వర్గాల ప్రజలు ఉంటారని అన్నారు. రాజకీయం చేయడానికి కొందరు నాయకులు వస్తున్నారని, అలాంటి నాయకులు వరదలు, వానలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారని అడిగారు. గత ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల అయిపోయినాక కనుమరుగయ్యారని చెప్పారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, పార్టీపై ఈ డివిజన్ ప్రజలకు నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్
నగర జనాభా అధికంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలోనూ రైతుబంధు రైతు బీమా వంటి పథకాల అమలవుతున్నాయని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యలక్ష్మి వంటి వినూత్న కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు సైతం అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు గుడిసెల్లో నివసిస్తున్న వారికి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి అర్హులైన వారికి ప్రభుత్వం తరపున పట్టాలు అందిస్తాం అన్నారు. డివిజన్ లో అందరూ బిఆర్ఎస్ పార్టీ ద్వారానే లబ్ది పొందుతున్నారు. శాంపేటలోని ఆటో యూనియన్కి కొంత సమస్య ఉన్నదని వారికి మా శ్రీ చక్ర ఆటో యూనియన్ తరపున సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం 30, 31 వ డివిజన్లోని 11,01,276 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ బాబు, కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.