టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్ క్వాష్ పిటిషన్
కమలాపూర్ లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్
కమలాపుర్ పోలీస్‌లతో పాటు కమలాపూర్ స్కూల్ హెడ్మాస్టర్ కు హైకోర్టు నోటీసులు
తదుపరి విచారణ జూన్ 16 కు వాయిదా వేసిన హై కోర్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి బండి సంజయ్ క్వాష్ పిటిషన్ వేశారు. కమలాపూర్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కమలాపూర్ స్కూల్ హెడ్మాస్టర్తో పాటు, స్థానిక పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్ 16కు తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.
పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన కేసులో బండి సంజయ్ కు మంజూరైన బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఎస్సీ హిందీ పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని, ఫోన్ ఇవ్వడం లేదని ఆ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అందులో ఆరోపించారు. అందుకే ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. బండి బెయిల్ రద్దు చేయాలని గతంలోనూ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో నిందితులు ఏ6, ఏ9 బెయిల్ పిటిషన్ల పన కూడా వాదనలు ముగిశాయి. తీర్పును మంగళవారానికి వేశారు.
సంచలనం రేపిన పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ను పోలీసులు కుట్రదారునిగా గుర్తించి ఏ - 1 పెట్టి కేసులు నమోదు చేశారు. 120 బి, 420, 447, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాట్సాప్ ద్వారా మీడియాకు రావడం... అక్కడి నుండి ఓ మాజీ మీడియా ప్రతినిధి బండి సంజయ్ సహా పలువురు రాజకీయ నాయకులకు దానిని పంపించడం జరిగింది. పరీక్ష పూర్తి కావడానికి మరో అరగంట ఉందనగా బండి సంజయ్ వాట్సాప్ కు అది వచ్చింది. దీంతో పోలీసులు బండి సంజయ్ సహా పలువురిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.
ఈ కేసులో బండి సంజయ్‌కు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20వేలతో పాటు ఇద్దరి పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విచారణకు సహకరించాలని ఆదే్శించింది. తర్వాత బండి సంజయ్‌ను ఫోన్ అప్పగించాలని విచారణకు రావాలని హన్మకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తన ఫోన్ పోయిందని బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బెయిల్ రావడంతో కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలయ్యారు.