Telangana News | మహబూబాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చేస్తామని తెలిపారు. వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మహబూబాద్ జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భంగపాటు తప్పదు

అనంతరం మహబూబాబాద్ జిల్లా సోమల తండా లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో లక్ష నుంచి రెండు లక్షల కోట్ల వరకు ఖర్చుపెట్టినా రైతులకు నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాస్తవాలు బయటికి వస్తున్నాయని వాటిని కప్పిపుచ్చుకునేందుకు టిఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు తప్పుడు మాటలు బంద్ చేయకపోతే మొన్న పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి చేరవేస్తోంది. బీఆర్ఎస్ నేతలు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుని సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలవద్దు.  

సీఎం రేవంత్ రెడ్డికి బేసిన్ ల గురించి తెలియదని టిఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయనకు బేసిన్ల గురించి అవగాహన లేకపోతే కృష్ణ, గోదావరి బేసిన్ నీళ్లను ఈ తెలంగాణ అవసరాల కోసమే వాడాలని ప్రజాభవన్ లో మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పారని గుర్తుంచుకోండి. బీఆర్ఎస్ పాలనలో నీళ్ల విషయంలో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా చూపించారు. బేసిన్లు లేవు, దేశజాలు లేవు. రాష్ట్రంలో ఏం జరిగినా పర్వాలేదు. కృష్ణా, గోదావరి నీళ్లు వాడుకోండని కేసిఆర్ ప్రకటన చేసిన విషయాన్ని వీడియోలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో చూపించారు. 

కృష్ణా, గోదావరికి బేసిన్ ప్రాజెక్టుల్లో నీళ్ల గురించి లెక్కలతో సహా చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో చర్చించడానికి సిద్ధంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇప్పటికే చెప్పారు, అదే విషయాన్ని మరోసారి చెబుతున్నాం. కృష్ణ, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్షనేత కేసీఆర్ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసురుతున్నాం. లక్ష కోట్ల పైబడి సంక్షేమం కోసం ఖర్చుపెట్టామన్న వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోవడం లేదు. రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత నిబద్ధత ఉంటే లెక్కలు తీసుకుని రండి. శాసనసభలో చర్చిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసిఆర్ కు సవాల్ విసిరితే.. ఆయన స్వీకరించలేదు. ప్రెస్ క్లబ్ కు వచ్చి సవాల్ అంటే ఎట్లా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసిందేంటి. కేటీఆర్ చేస్తున్నది ఏంటి. సవాల్ స్వీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. కరెంటు కోతలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, మీ పాలనా కాలంలో ఉన్న కరెంటు డిమాండ్ ఎంత, ప్రస్తుత కరెంటు డిమాండ్ ఎంత చర్చకు సిద్ధమా అని’ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.

 రుణమాఫీ పూర్తి చేశాంగత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 17,162 మెగావాట్ల పిక్ డిమాండ్ ఉండగా ఈ సంవత్సరం మార్చిలో అదనంగా 2000 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చిందని వివరించారు. 2000 మెగావాట్లు అదనపు డిమాండ్ వచ్చినా కరెంటు కోతలు లేవు, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం, రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్తు సేవలు అందుతున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లోనే ప్రజా ప్రభుత్వం 21 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసింది, రుతుపవనాలు మొదలుకాగానే 9 రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా జమ చేశాం. 10 సంవత్సరాల కాలంలో నాలుగు దఫాలుగా 25,000 చొప్పున బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తే అవి వడ్డీకే సరిపోలేదని భట్టి విక్రమార్క అన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్తు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12,500 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం ద్వారా 50 లక్షల మంది పేదలు ప్రయోజనం పొందుతున్నారు. గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేందుకు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని నల్లమల డిక్లరేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పోడు రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు స్ప్రింక్లర్లు, డ్రిప్పు, అవకాడో, వెదురు వంటి మొక్కలు మొత్తం ఉచితంగా అందించేందుకు 12,600 కోట్ల  కేటాయించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. 

ఈ 12 నుంచి వడ్డీ లేని రుణాలురాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా మహిళలకు ప్రతి ఏడాది 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించాం. మొదటి సంవత్సరంలో 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామన్నారు. ఈనెల 12 నుంచి 18 వరకుఅన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయబోతున్నాం, మహిళలనీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేద విద్యార్థులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన విద్యను అప్పగించడానికి ఒక్కో పాఠశాలకు 200 కోట్లు కేటాయించి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.