వరంగల్ : ఆరుగాలం కష్టపడి పత్తిపంట పండిస్తున్న రైతులను కొందరు దళారులు మోసం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కల్లెడ గ్రామానికి చెందిన పలువురు బేరగాళ్లు ములుగు జిల్లా ములుగు మండలం అంకన్నగూడెం తదితర ఏజెన్సీ గ్రామాల నుంచి పత్తి కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు పత్తిని ట్రక్కుల్లో తరలించారు దళారులు. అయితే తక్కువ తూకం వేస్తూ దళారులు చేస్తున్న మోసాన్ని సోమవారం రాత్రి తేటతెల్లం చేశారు. 


దళారులు తీసుకొచ్చిన కాంటాతో పత్తిని తక్కువ తూకం వేస్తూ తరలించినట్లు స్థానికులు, పత్తి రైతులు గుర్తించారు. తూకంపై అనుమానం వచ్చి అంకన్నగూడెంకు చెందిన పలువురు రైతులు మరో ఎలక్ట్రిక్ కాంటా తేవడంతో మోసం బహిర్గతం అయ్యింది. రైతుల పత్తి బస్తాను తూకం వేస్తే దళారులు తెచ్చిన కాంటాలో 8 క్వింటాళ్లకు గాను 5 క్వింటాళ్లు కూడా తూగలేదు. కేవలం 4.5 క్వింటాళ్ల వరకు పత్తి తూగినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. దళారుల మోసం ఉందని గ్రహించి తాము తెచ్చిన ఎలక్ట్రిక్ కాంటాతో తూకం వేయడంతో తక్కువ తూకం మోసం బహిర్గతం అయింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన రైతులు తమ కష్టాన్ని ఇలా తక్కువ తూకంతో మోసం చేస్తావా అంటూ దళారులపై దాడి చేశారు. 


అధిక పెట్టుబడి ఆశ చూపుతూ..
రైతులను మార్కెట్ ధరకంటే ఎక్కువ ఇస్తామని ఆశచూపి కొందరు దళారులు రైతులను మోసం చేస్తున్నారు. మార్కెట్ లో పత్తి ధర క్వింటాలుకు రూ.7,455లు ఉంటే దళారులు మాత్రం రూ.8వేలు అందిస్తామని ఆశ చూపి తాము తెచ్చిన కాంటాతో తక్కువ తూకం ద్వారా మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ విషయాన్ని తూనికలు, కొలతల శాఖకు చెబుతామని చెప్పడంతో దళారులు కాళ్లబేరానికి వచ్చారు. రైతులు తెచ్చిన కాంటాతోనే తూకం కొనసాగిస్తున్నారు. 


రైతులు సైతం ఎక్కవ ధరలకు ఆశపడి, మార్కెట్ లో లేని ధర ఎలా ఇస్తారు, ఇది సాధ్యం కాదని ఆలోచన లేకుండా ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తామని చెబితే ఆ దళారులకే పత్తి విక్రయాలు చేయాలని అత్యాశకు పోయి వారి శ్రమకు తగిన ఫలితాన్ని కూడా పొందలేకపోతున్నారని అధికారులు పలుమార్లు చెప్పారు. మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు విక్రయాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయంటే అక్కడ మోసం జరుగుతుందని గ్రహించి రైతులు అప్రమత్తం కావాలి, తమకు సమాచారం అందించాలని తూనికలు, కొలతల శాఖ అధికారులు సూచించారు. 


రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద చాలా మంది రైతులు లబ్ధి పొందడం లేదు. ఏటా లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. సాగుభూమి ఉన్న రైతులందరికీ పీఎం కిసాన్ కింద ఏటా 6 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్న కేంద్రం.. ఈ కేవైసీ నిబంధనలు పెట్టడంతో వేలాది మంది రైతులు ఈ పథకానికి అర్హత కోల్పోతున్నారు. ఈ పథకానికి అర్హత పొందేందుకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. ఏటా జనవరిలో మూడో విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న కేంద్రం ఈ కేవైసీ పూర్తి కాలేదన్న నెపంతో చెల్లింపులు జరపడం లేదు. రైతుల ఈ కేవైసీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను నియమించింది. అయితే ప్రభుత్వం ఆర్బీకేల్లో ధాన్యం సేకరణ, ఈ కేవైసీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.