తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. అప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. 


సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి అదే స్టైల్‌లో తెలంగాణ రాజకీయాలపై కామెంట్స్‌ చేశారు. ఎప్పుడూ కాంగ్రెస్‌పైనే తీవ్ర విమర్శలు చేసే ఆయన ఈసారి చాలా పాజిటివ్‌గా స్పందించారు. కాంగ్రెస్ గాడిన పడుతుందన్న కోమటి రెడ్డి... వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కీలకం కాబోతోందని అన్నారు.  గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని సూచించిన కోమటి రెడ్డి... వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేశారు. 


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు రావని అంచనా వేస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే అప్పుడు బీఆర్‌ఎస్‌కు ఉన్న మార్గం అవుతుందన్నారు. అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా... ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. 


కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడమే ప్రధాన సమస్య అన్న కోమటి రెడ్డి ఇప్పుడిప్పుడే పార్టీ ఓ దారిలోకి వస్తోందని కామెంట్‌చేశారు. సీనియర్ అయినా, జూనియర్ అయినా.. గెలిచే సత్తా ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలని సూచించారు. అలా చేస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో నలభై నుంచి యాభై స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ఏదైనా మిరాకిల్ జరిగేతే తప్ప కాంగ్రెస్‌కు అంతకు మించిన మెజార్టీ రాదన్నారు కోమటిరెడ్డి.  తాను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బస్సు యాత్ర లేదా బైక్ యాత్ర చేస్తానన్నారు.