Eoin Morgan Retirement: 2019 వన్డే ప్రపంచకప్ విజేత అయిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
'నా క్రికెట్ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా భార్య, కుటుంబం, స్నేహితులు, సన్నిహితులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా సహచరులు, కోచ్ లు, అభిమానులకు కృతజ్ఞతలు. అలాగే తెర వెనుక ఉండి నన్ను ఒక మంచి ఆటగాడిగా మార్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అని మోర్గాన్ ట్వీట్ చేశాడు.
క్రికెట్ నాకు చాలా ఇచ్చింది
'క్రికెట్ కు ధన్యవాదాలు. క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. నేను ప్రపంచాన్ని పర్యటించగలిగాను. నమ్మశక్యం కాని వ్యక్తులను కలిశాను. వారిలో చాలామందితో జీవితకాల స్నేహాన్ని పెంచుకున్నాను. ఇదంతా క్రికెట్ వలనే సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ జట్ల కోసం ఆడడం నాకు చాలా జ్ఞాపకాలను అందించింది. వాటిని ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటాను' అని మోర్గాన్ అన్నాడు. రిటైర్మెంట్ అనంతరం కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని తెలిపాడు. అయితే క్రికెట్ లో ఉండే సాహసం, సవాళ్లను మాత్రం కోల్పోతానని చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ జట్టుకు మోర్గాన్ నాయకత్వం వహించాడు. తన దేశానికి తొలిసారి ప్రపంచకప్ ను అందించాడు.
కెప్టెన్ గా దేశానికి ప్రపంచకప్
37 ఏళ్ల ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్ కు తొలిసారిగా ప్రపంచకప్ ను అందించాడు. కెరీర్ లో మొత్తం 16 టెస్టుల్లో 700 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 130. 248 వన్డేలకు ప్రాతినిథ్యం వహించి 7701 పరుగులు సాధించాడు. అందులో 14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే 115 టీ20ల్లో 14 హాఫ్ సెంచరీలతో సహా 2458 పరుగులు చేశాడు.
ఇయాన్ మోర్గాన్ మొదట ఐర్లాండ్ జాతీయ జట్టు తరఫున 2006లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2009లో ఇంగ్లండ్ తరఫున తన తొలి మ్యాచ్ ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో విశేషంగా రాణించాడు. ఈ క్రమంలోనే 2015లో జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే 2019లో కెప్టెన్ గా ఇంగ్లండ్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ ను అందించాడు.
గత రెండున్నరేళ్లుగా మోర్గాన్ వ్యక్తిగత ప్రదర్శన పడిపోతూ వస్తోంది. పరుగులు చేయలేక ఇబ్బందిపడుతున్నాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ కు కెప్టెన్ గా వ్యవహరించిన మోర్గాన్ జట్టును రన్నరప్ గా నిలిపాడు. అయితే కెప్టెన్ గా రాణించినప్పటికీ ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. నెదర్లాండ్స్ తో జరిగిన 2 వన్డేల సిరీస్ ఇయాన్ మోర్గాన్ కు చివరి సిరీస్.