కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్ పెట్ మండలంలోని ఏల్లూర్ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందాడు. అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ అనే విద్యార్థి గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతు బుధవారం రోజు ప్రాణాలు విడిచాడు. విద్యార్థి ఆరోగ్యం పట్ల ఆ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఆ విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహంతోనే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 


వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి..!


అయితే పదో తరగతి చదువుతున్న అల్లం రాజేష్ గత వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. కానీ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది పట్టించుకోలేదు. చాలా ఆలస్యంగా విద్యార్థి తల్లి తండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. అయితే బుధవారం తల్లిదండ్రులు బయలుదేరి ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే రాజేష్ పరిస్థితి విషమించింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు రాజేష్ ను వెంటనే కాగజ్‌నగర్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే జిల్లా ఆసుపత్రి లేదా రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే రాజేష్ తల్లిదండ్రులు అతడిని ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి చనిపోయాడు. రాజేష్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నేతలు అక్కడకు చేరుకొని వారి కుటుంబానికి అండగా నిలిచారు. 


15 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం..


విద్యార్థి మృతి పట్ల ప్రభుత్వం 15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. విద్యార్థి మృతికి కారకులైన డీటీడీఓ, ఏటీడీఓ, ప్రధానోపాధ్యాయుడు, హెచ్ డబ్ల్యూఓలను విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ ఆర్డీఓ దత్తు.. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అంత్యక్రియలకు 25,000 ఇస్తామని నచ్చజెప్పారు. అయితే తమకు అవేమీ వద్దని.. న్యాయం మాత్రమే కావాలంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనను ఆపేది లేదని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. 


గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..


అనంతరం అంతర్జాతీయ రహదారిపై బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో అంతరాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ సమస్య ఎర్పాడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి వారి గ్రామానికి పంపించేశారు. అయితే పోలీసుల చర్యలపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా తమను అరెస్టు చేసి.. దొంగ చాటుగా బాలుడి మృతదేహాన్ని పంపిచారంటూ ఆరోపిస్తున్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో చనిపోయిన ఆ విద్యార్థి కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారికి న్యాయం చేయమని కోరారు. ఈక్రమంలోనే గురువారం కుమురం భీం ఆసిఫాబాద్  జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థల బంద్ తోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.