Chhattisgarh Maoists: వరంగల్: ఒకరు ప్రజా ఉద్యమాల పేరుతో అడవుల్లో ఉండి పోరాడే అన్నలు.. మరొకరు శాంతి భద్రతల పేరుతో ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే పోలీసులు. ఇప్పుడు ఇద్దరు అడవుల్లో ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. వీరి మధ్య ఆధిపత్య పోరులో అమాయక గిరిజనులు, ప్రజలు బలవుతున్నారు. ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న భయానక పరిస్థితి ఇది.


ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్ కౌంటర్లతో అడవి దద్దరిల్లుతుంది. ఐదు నెలల నుంచి వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండడంతో మావోయిస్టు పార్టీ నేతలు ప్రతి ఎన్ కౌంటర్ లో పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత లో పోలీసులు పైచేయి సాధిస్తున్నారని చెప్పవచ్చు. ఛత్తీస్ గఢ్ అభయారణ్యాన్ని పోలీసులు చుట్టుముట్టి భారీ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు. పోలీస్ లు అడవుల్లోకి రాకుండా వారి వ్యూహాలను దెబ్బతీయడమే లక్ష్యంగా మావోయిస్టులు ఆడవుల చుట్టూ, అడవిలో క్లైమర్ మైన్స్, ప్రెజర్ బాంబులు అమరుస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దుల్లో భయానక వాతావరణం
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ సంవత్సరం జనవరి నుండి సాగుతున్న కగార్ పేరుతో మావోయిస్టు ఏరివేత ఆపరేషన్ లో సుమారు 150 మంది మావోయిస్టులు చనిపోయారు. ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు పోలీసులే లక్ష్యంగా కొంగల, కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు క్లైమెర్ మైన్స్, ప్రెజర్ బాంబులు అమరుస్తున్నారు. పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి అమాయక ప్రజలు చనిపోతున్నారు. కొంగల, కర్రెగుట్ట ప్రాంత అడవులు ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన గిరిజనులు, ప్రజలు వివిధ పనుల కోసం అడవుల నుండి అటు ఇటు వచ్చి వెళ్తుంటారు. కొందరు వంట చెరుకు కోసం మరికొందరు అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్తారు. అయితే పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 
ప్రెజర్ బాంబు పేలి ఒకరి మృతి
జూన్ 3వ తేదీన కొంగల అటవీ ప్రాంతంలో వంట చెరుకు కోసం ఇల్లందుల ఏసు అనే వ్యక్తి వెళ్ళాడు. వంటచెరుకు సేకరిస్తున్న క్రమంలో  ప్రెజర్ బాంబు పేలి మృతి చెందాడు. దీంతో మావోయిస్టు పార్టీ వెంటనే స్పందించి ఓ లేఖ విడుదల చేసింది. గిరిజనులు, గిరిజనేతరులు కొంగాల, కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లోకి రావద్దని పోలీసుల లక్ష్యంగా బాంబులను అమర్చడం జరిగిందని మావోయిస్టులు లేఖ లో పేర్కొన్నారు. దీంతో ప్రజలు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లడానికి జంకుతున్నారు. కానీ వీరి జీవనమే అడవిలో కాబట్టి వెళ్ళాక తప్పడం లేదు. ఏసు మృతి మరువకముందే ఈనెల 13వ తేదీన కర్రెగుట్ట అడవిలోని బెదంగుట్ట సమీపంలో ఉన్న శివాలయం దర్శనానికి వెళ్తున్న సునీతా అనే మహిళ మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి తీవ్రంగా గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీత కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల ఎక్కడ ఏ బాంబు ఉంటుందో అవి పేలి ఎవరి ప్రాణాలు పోతాయో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.


వంట చెరుకు కోసం అడవిలోకి వెళ్లిన యేసు మృతిని నిరసిస్తూ వెంకటాపురం మండలానికి చెందిన పలు గ్రామాల ప్రజలు మావోయిస్టులకు వ్యతిరేకంగా జగనాధపురంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అధిపత్యం కోసం అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని నినాదాలు చేశారు. ప్రజల నిరసనతో మావోయిస్టులు కంగుతిన్నారు.


అయితే ఏసు మృతి చెందిన వెంటనే మావోయిస్టు పార్టీ అడవుల్లోకి రావద్దు మావోయిస్టులు లేఖ విడుదల చేయడం తెలిసిందే. ములుగు జిల్లా ఎస్పీ పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా లేఖ విడుదల చేశారు. అడవుల్లోకి ప్రజలు, పోలీసులు రాకుండా టార్గెట్ చేసి బాంబులు అమర్చారని, మావోయిస్టులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.


అయితే ఎవరి ఆధిపత్యం కోసం వారు కాల్పులు జరుపుకోవడం.. లేఖలు విడుదల చేసుకోవడం జరుగుతుంది. ఇటు మావోయిస్టు అటు పోలీసుల అధిపతి పోరులు అభం శుభం తెలియని అడవులను నమ్ముకొని జీవిస్తున్న అమాయక ప్రజలు బలవుతున్నారు. పది రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరిగాయి. ఒకరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కర్రెగుట్ట, కొంగాల అటవీ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆధిపత్య పోరు ఇక్కడతోనే అగుతుందా లేక కొనసాగుతున్న అనే భయాందోళనలో అటవీ ప్రాంత చుట్టుపక్కల ప్రజలు గిరిజనులు భయంతో బతకాల్సిన పరిస్థితులున్నాయి.