ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రులు ఆహ్వానించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసిన జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.
గిరిజన,మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా, ఎండోమెంట్స్ కమిషనర్ అనిల్ కుమార్, మేడారం దేవాలయ ఈవో రాజేందర్, జాతర ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొర్నిబెల్లి శివయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, బడే నాగజ్యోతి, దుర్గం రమణయ్య తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం చేసుకుని తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్లేలా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి. 16 నుంచి 19వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జోన్ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాతో మాట్లాడారు.
ఆరువేల మంది పోలీసులతో జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రెండు ముఖ్యమైన లక్ష్యాలతో పోలీసులు మేడారం జాతర బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అమ్మవార్ల దర్శించుకోవడం, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడం, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాతరను విజయవంతం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
వరంగల్ నుంచి తరలివచ్చే ప్రైవేటు వాహనాలు గుడేప్పాడు, ములుగు, పస్రా, నార్లపూర్ చేరుకోని పోలీసులు సూచించిన ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాల్సి వుంటుంది. వరంగల్ నుంచి బయలుదేరి వేళ్ళే ఆర్టీసీ బస్సులు గుడెప్పాడు, మల్లంపల్లి, ములుగు, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటాయి. ఇదే మార్గం ద్వారా ఆర్టీసీ బస్సులు వరంగల్ చేరుకుంటాయి ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు ఏటూరునాగరం, చిన్నబోయినపల్లి, కొండాయి, ఉరట్టం వద్ద పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలోని ఇదే మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, పెగడప కాల్వపల్లి, ఉరట్టంలో పార్కింగ్ చేసుకోవాలి. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దుదేకులపల్లి మీదు కరీంనగర్ చేరుకోవాల్సి ఉంటుంది.
తిరుగు ప్రయాణంలో గత జాతరలో అవలంభించిన వన్ వేను ఈసారి కూడా అమలు చేయనున్నారు. మేడారం నుంచి తిరిగి వరంగల్ ఆపై ప్రాంతాలకు తిరిగి వెళ్ళే వాహనాలు నార్లపూర్ క్రాస్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, దుదేకులపల్లి, కమాలాపూర్ క్రాస్, భూపాలు పర్కాల, అంబాల, అంబాల క్రాస్, కిట్స్ కాలేజ్, వరంగల్ బైపాస్, కరుణాపురం, పెండ్యాల మీదుగా వాహనా తిరిగి పోవాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ జోన్ మొత్తం 20 సెక్టార్లుగా విభజించి ముగ్గురు డి.సి.పిలు ఇంచార్జులుగా ఉంటారు. ప్రతి సెక్టార్‌కు ఒక అదనపు ఎస్సీ లేదా డి.ఎస్పీ ఇంచార్జ్ ఉంటారు. 30 ద్విచక్ర వాహన టీంలు ఏర్పాటు చేశారు. ఈ టీం మూడు షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తారు. ట్రాఫిక్ పర్యవేక్షణకు గట్టమ్మ గుట్ట నుంచి పస్రా వరకు మొత్తం 320 సి.సి కెమెరాల ఏర్పాటు చేశారు.
పస్రా మేడారం మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ జోషి వివరించారు. పస్రా మేడారం మధ్య అర కిలో మీటర్‌కు ఒక పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. టోయింగ్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు జోషీ.
జాతరకు వాహనాలపై తరలివచ్చే భక్తులు మధ్యం సేవించి నడపొద్దని.. ఒకదాని వెనుక ఒకటి వాహనాన్ని నడపాలని, రోడ్లపై వాహనాలను నిలపొద్దని విజ్ఞప్తి చేశారు. జాతర నిర్వహణ సందర్భంగా పోలీసు శాఖకు భక్తులు పూర్తి సహకరించాలని కోరారు.