Telangana Weather Updates - వరంగల్ :  ఉదయాన్నే ఎటుచూసినా దట్టమైన పొగమంచు కప్పేసింది. అది ఎంతలా అంటే.. కళ్ల ముందు కొన్ని అడుగుల ముందు ఉన్న మనిషి కూడా కనపడనంతలా. ఉదయం మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లిన వారు ఈ దృశ్యాలను మొబైల్‌ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. వాహనదారులు, పాదచారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించక వాహనదారులు భయంభయంగా ప్రయాణించారు. పాదచారుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వాహనాలు కనిపించక ప్రమాదాలు కూడా జరిగాయి. నవంబర్ నెల కావడం, ఈశాన్య రుతువపనాలు రావడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.


కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన... ఇటు గోదావరి నది అనుకోని పొగ మంచు
కమ్ముకున్న పొగ మంచు ప్రయాణికులతోపాటు వాకింగ్ చేసే యువకులకు సైతం ఇబ్బందిగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామం లోని కమ్ముకున్న పొగ మంచుతో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పొగ మంచు బాగా ఉండడంతో మహారాష్ట్ర కు వెళ్ళే వాహనాలను అంతర్ రాష్ట్ర వంతెన మీద 30 నిమిషాల పాటు సైడ్ కి పార్క్ చేసుకున్నారు. కొంత మంది వాహనదారులు పార్కింగ్ లైట్స్ వేసుకొని నెమ్మదిగా ముందుకు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రోజు వాకింగ్ చేస్తున్న ఇవకులకు సైతం పొగమంచు తో ఇబ్బంది పడ్డారు. కొంత మంది యువకులు పొగ మంచు తో ఎంజాయ్ చేశారు..


అసలు పొగ మంచు ఎందుకు వస్తుంది?
పొగమంచు ఏర్పడడానికి వాయు కాలుష్యమే కారణమని  నిపుణులు చెబుతున్నారు. గాలిలోని కాలుష్యంతో మంచు కలిసి అది భూఉపరితలంపై పేరుకుపోయి, పొగమంచుగా రూపాంతరం చెంది పొగ మంచు గా ఏర్పడుతుందని చెబుతున్నారు. ఎండ వచ్చే వరకు అది అలానే గాలిలో తేలుతూ ఉంటుందన్నారు. సూర్యకిరణాలతో క్రమేపీ మంచు కరిగిపోయి, అందులోని కాలుష్యం పైకి పోతుంది.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 34.8 డిగ్రీలు నమోదు కాగా, హకీంపేటలో అత్యల్పంగా 16 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.


నవంబర్ 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.  బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. మొదట నవంబర్ 8న ఈ అల్పపీడనం ఏర్పడుతుందని భావించినా.. 9న ఏర్పడుతుందని అప్ డేట్ ఇచ్చారు వాతావరణశాఖ అధికారులు. అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి.