Warangal CP Comments : పేపర్ లీకేజీని బండి సంజయ్ నేతృత్వంలో ఓ గేమ్ ప్లాన్‌లా చేస్తున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ రంగనాథ్ ప్రకటించారు. టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రశాంత్, మహేష్ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్ కు పంపారని, బండి సంజయ్‌కు ఉదయం 11.24 గంటలకు క్వశ్చన్ పేపర్ చేరిందని సీపీ వెల్లడించారు. ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలతో పాటు ఆయన ఏపీఏకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారన్నారు. అరెస్ట్ సమయంలో బండి సంజయ్ తన దగ్గర ఫోన్ లేదన్నారని సీపీ చెప్పారు. , బీజేపీలో చాలామందికి పేపర్ షేర్ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ పేర్కొన్నారు.
బండి సంజయ్ ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని సీపీ రంగనాథ్ తెలిపారు. కుట్ర చేశారు కాబట్టే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశామని ఇతర బీజేపీ నేతలపై కేసులు పెట్టలేదని సీపీ గుర్తు చేశారు. ఆయన నేరం చేయకపోతే ఫోన్ ఎందుకు దాస్తున్నారని సీపీ ప్రశ్నించారు. భయపడి చాలా డేటా డిలీట్ చేశారని.. మొత్తం బండి సంజయ్ నేతృత్వంలోనే కుట్ర జరిగిందని సీపీ స్పష్టం చేశారు. అరెస్ట్ విషయంలో తాము చట్టాన్ని ఫాలో అయ్యామని రంగనాథ్ స్పష్టం చేశారు. 41 సీఆర్సీసీ ప్రకారం.. నోటీస్ లేకుండా కూడా అరెస్ట్ చేయవచ్చన్నారు. ఎగ్జామ్స్‌ను రద్దు చేయించాలన్న దురుద్దేశం నిందితుల్లో ఉందన్నారు. ప్రశ్నాపత్రం పంపాక ప్రశాంత్ 149 మందితో మాట్లాడాడని, పేపర్ లీక్‌కు ముందు రోజు బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. వాట్సాప్ చాట్‌ను డిలీట్ చేసుకున్నారు. దాన్ని మళ్లీ తెప్పించేందుకు సమయం పడుతుందని సీపీ తెలిపారు. ఈటల రాజేందర్‌తో నిందితుడు ఫోన్‌లో మాట్లాడలేదని రంగనాథ్ తెలిపారు.
పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. వికారాబాద్ , కమలపూర్ లో పేపర్ లీకేజ్ )లపై బండి సంజయ్ ప్రెస్ నోట్ ఇచ్చారని, పేపర్ లీకేజ్‌లకు ప్రభుత్వమే బాధ్యతంటూ.. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామన్నారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.