Minister Errabelli Dayakar Rao : 'రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ఆరాచ‌క శ‌క్తులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాల‌ని, అస్థిర ప‌ర‌చాల‌ని చూస్తున్నాయి. అలాంటి శ‌క్తులే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు ప‌న్నుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వంత పాడుతుంది. అలాంటి కుట్రల‌ను ఛేదిస్తున్న సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల బాగోగుల గురించే ఆలోచిస్తున్నారు.' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రగతి లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రల‌ను దీటుగా ఎదుర్కోవాలన్నారు. సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నారు. అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.


కేసీఆర్ దయతో మంత్రి పదవి 


ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బ‌ల‌మైన బీఆర్ఎస్ పార్టీని, నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన ప‌ర‌చ‌డానికి కుట్రలు జ‌రుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని బ‌ద‌నాం చేస్తూ, కూల్చే కుట్రల‌కు కూడా తెర‌లేపారన్నారు. వాట‌న్నింటినీ కేసీఆర్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలోనే మ‌న‌మంతా పార్టీకి, కేసీఆర్ కి అండ‌గా నిల‌వాలన్నారు. అలాంటి అరాచక శ‌క్తుల ఆట క‌ట్టించాల‌ని ప్రజ‌ల‌కు, పార్టీ కార్యక‌ర్తల‌కు పిలుపునిచ్చారు. కేసీఆర్ చావు నోట్లో త‌ల‌పెట్టి, తెలంగాణ‌ను తేవ‌డ‌మే కాదు, అద్భుత ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. సీఎం కేసీఆర్ ద‌య వ‌ల్ల నేను మంత్రిని అయ్యానన్నారు. మీ ద‌య వ‌ల్ల ఎమ్మెల్యేను అయ్యానని చెప్పుకొన్నారు. మ‌న‌లో మ‌న‌కు స‌మ‌స్యలేమైనా ఉంటే ప‌క్కన పెట్టి అంతా క‌లిసి క‌ట్టుగా ఉందామన్నారు.   


ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల బీమా 


"బీఆర్ఎస్ లాంటి పార్టీ దేశంలో లేదు. 80 ల‌క్షల మంది బ‌ల‌గం బీఆర్ఎస్ ది. కార్యక‌ర్త ఏ కార‌ణం చేత చ‌నిపోయినా, వారి పేరున బీమా పార్టీయే క‌ట్టి 2 ల‌క్షల రూపాయ‌లు ఇస్తున్న క‌న్న త‌ల్లిలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అందుకే క‌న్న త‌ల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని న‌మ్ముకుని ఉన్న వారికి ఎప్పటికీ మంచే జ‌రుగుతుంది. సీఎం కేసీఆర్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు పార్టీకి అండ‌గా ఉన్నంత కాలం మ‌న‌మంతా బాగుంటం. అయితే మ‌న‌లో మ‌న‌కు చిన్న స‌మ‌స్యలుంటే ప‌క్కన పెడ‌దాం. అన్నద‌మ్ములోలె క‌లిసిక‌ట్టుగా ఉందాం.  మీ అంద‌రి ద‌య వ‌ల్ల నేను పాల‌కుర్తి నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అంత‌కు ముందు వ‌ర్ధన్నపేట నుంచి 3 సార్లు ఎమ్మెల్యేని, ఒక‌సారి ఎంపీని, ఓట‌మి లేకుండా గెలుస్తున్న న‌న్ను సీఎం మంత్రిని చేశారు. మంచి పోర్టు పోలియో ఇచ్చారు. అంద‌రికీ నీళ్లిచ్చే మంత్రిని నేనే, గ్రామాల‌ను అభివృద్ధి చేసే మంత్రిని నేనే, ఉపాధి హామీకి మంత్రిని నేనే, మ‌హిళ‌ల మంత్రిని నేనే. ఇన్ని ముఖ్యమైన శాఖ‌ల‌తో  ప్రజ‌ల‌కు సేవ చేసే అవ‌కాశాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారు. దీన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ, నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా గ‌తంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశాను" - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ 


ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌లో గ్రామాల‌కు అభివృద్ధి వ‌రాలు


ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌ల్లో భాగంగా ఆయా గ్రామాల‌కు కావాల్సిన అభివృద్ధి నిధులను మంత్రి ఎర్రబెల్లి మంజూరు చేశారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌లో దుర్గమ్మ గుడికి, మహిళా భవనం, గ్రామ పంచాయతీ భవనానికి నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంత‌ర్గత రోడ్లు, గ్రామాల  మ‌ధ్య రోడ్లను వేస్తామ‌ని చెప్పారు. ఆయా గ్రామాల్లో 10వ తరగతి పూర్తి చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు పంపిణీకి హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు కార్యకర్తలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు. ఇండ్లు, పెన్షన్లు, దళిత బంధు, కమ్యూనిటీ హాళ్లు వంటివి చర్చించారు. కొన్ని సామాజిక కులాలకు కమిటీ హాళ్లు, ఆలయాలను అక్కడికక్కడే మంత్రి మంజూరు చేశారు.