Warangal MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్ ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తామన్నారు. అదే విధంగా ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో భీమారానికి చెందిన డయాలసిస్ పేషెంట్ శ్రీనివాస్ ను ఎలుకలు కొరికి ఘటనలో అధికారులు ఎంజీఎం సూపరిండెంట్ తో పాటు మరో ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై వేటు వేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సూపరిండెంట్ శ్రీనివాసరావు బదిలీ చేస్తూ నూతన సూపరిండెంట్ గా డాక్టర్ చంద్రశేఖర్ కు బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్ నిమ్స్ కు తరలింపు
ఎలుకలు కొరికిన బాధితుల్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ గోపి, డీఎంఈ రమేష్ రెడ్డి ఎంజీఎంలో ఇవాళ పరామర్శించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన తీవ్రంగా కలచి వేసిందని, పారిశుద్ధ్యం లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని శానిటేషన్ కాంట్రాక్ట్ ను బ్లాక్ లిస్టులో పెడతామని, జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాల్సిందిగా డీఎంఈ, జిల్లా కలెక్టర్ లను విచారణ అధికారులుగా నియమించామని విచారణ అనంతరం మరి కొంత మందిపై చర్య తీసుకుంటామని మంత్రి దయాకర్ రావు తెలిపారు.
ఇలాంటి ఘటనలు బాధాకరం
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు బాధాకరమని డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున రోగికి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, సంఘటనకు బాధ్యులైన వారిపై విచారణ అనంతరం చర్యలు ఉంటాయన్నారు. రోగులకు భరోసా ఇచ్చే విధంగా వైద్యులు పనిచేయాలని రమేష్ రెడ్డి తెలిపారు.
అసలేం జరిగిందంటే?
కిడ్నీ సంబంధిత వ్యాధితో వచ్చిన వ్యక్తిని ఐసీయూ(ICU)లో ఉంచికి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. వరంగల్‌లోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఈ నెల 26 వ తేదీ సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ వేలును ఎలుకలు కొరికాయి. విషయాన్ని సిబ్బందికి చెప్పాడు. వెంటనే వాళ్లు చికిత్స చేశారు. మళ్లీ ఈ ఉదయం(గురువారం) సుమారు మూడు గంటల ప్రాంతంలో ఎలుకలు శ్రీనివాస్ కాళ్లను తీవ్రంగా కొరికాయి. విపరీతమైన రక్తస్రావం జరిగింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ ఎలకల దాడితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.