ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామంటూ ఓ బెదిరింపు ఈ - మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా, దేశంలో వేలాది మందిని చంపేందుకు తన వద్ద 20 కిలోల ఆర్డీఎక్స్ ఉందని ఆగంతుకుడు బెదిరింపు ఈ - మెయిల్‌లో పేర్కొన్నాడు. తాను దేశంలో 20 బాంబు దాడులు ప్లాన్ చేసినట్లుగా హెచ్చరించాడని ఈ మేరకు ‘ది ఫ్రీ ప్రెస్ జర్నల్’ మీడియా సంస్థ కథనం రాసింది. ఆ కథనం ప్రకారం.. ఈ - మెయిల్‌లో ఆ వ్యక్తికి ప్రధాని మోదీపై కొన్ని ఫిర్యాదులు ఉన్నాయని, ఆయన ‘తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడ’ని మెయిల్‌లో ఉంది.
ఇలా విధ్వంసం చేయగల వ్యక్తులతో తాను ఇప్పటికే టచ్‌లో ఉన్నానని, ఈ దేశంలో పెను విషాదాన్ని సృష్టిస్తానని ఉంది. తాను ఫిబ్రవరి 28న స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేశానని మెయిల్‌లో పేర్కొన్నాడు. ఈ బెదిరింపు ఈ - మెయిల్ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు వచ్చింది. దీంతో ఆ మెయిల్ రాకపై విచారణ జరుపుతున్నట్లుగా నిఘా వర్గాలు వెల్లడించాయి.
NIA ముంబయి శాఖకు ఈ బెదిరింపు ఈ - మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ దాన్ని మిగతా దర్యాప్తు సంస్థలకు కూడా పంపింది. ప్రస్తుతం సైబర్ సెక్యురిటీ ఏజెన్సీ సదరు ఈ - మెయిల్ పూర్వాపరాలపై విచారణ జరుపుతున్నారు. అది ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో కనుగొనే పనిలో ఉన్నారు.