ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నేడు (ఏప్రిల్‌ 1) విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ‘పరీక్షా పే చర్చా’ (Pariksha Pe Charcha) 5వ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఉదయం 11 గంటలకు ఇది ప్రారంభం అయింది. కరోనా తర్వాత ఈ కార్యక్రమానికి ప్రధాని ప్రత్యక్షంగా హాజరు కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఈ కార్యక్రమం వర్చువల్‌గా జరుగుతోంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి వెయ్యి మంది విద్యార్థులు పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు చాలా ప్రియమైన, సంతోషకరమైన కార్యక్రమం. చాలా కాలం తర్వాత నేను మిమ్మల్ని కలవగలుగుతున్నాను. మీరు పరీక్షలకు భయపడతారని నేను అనుకోను. మీ తల్లిదండ్రులే పరీక్షలంటే భయపడతారు.’’ అని మొదలుపెట్టారు. దీంతో పిల్లలు మోదీని ప్రశ్నలు అడిగారు. ఖుషీ అనే విద్యార్థిని ప్రధాని మోదీకి తన మొదటి ప్రశ్న వేసింది.







ప్రశ్న (ఖుషీ జైన్, ఆనంద్ విహార్ ఢిల్లీ విద్యార్థి): మనం భయాందోళనలో ఉన్నప్పుడు పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?


మోదీ సమాధానం: ‘ఎందుకు భయపడుతున్నావు? ఇది మీ మొదటి పరీక్షా? పరీక్ష అనేది మన జీవితంలో ఒక భాగం. ఇన్ని సార్లు పరీక్షలు పెట్టినప్పుడు మనం ఎలా భయపడతాం? ప్రిపరేషన్ లేకపోవడం వల్ల మీ మనసులో ఉన్న టెన్షన్ ఇదా? బహుశా పరీక్ష కోసం సరిగ్గా సన్నద్ధం కాలేదా? భయపడవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఒత్తిడి వాతావరణాన్ని పెంచకండి.







రెండవది, మీ మనస్సులో ఏర్పడే భయాందోళనల వల్ల, మీరు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ రాబోయే పరీక్షా సమయాన్ని రొటీన్‌గానే గడపండి. పరీక్ష అనేది జీవితంలో సులభమైన భాగమని మీ మనస్సులో నిర్ణయించుకోండి. మన అభివృద్ధి ప్రయాణంలో ఇవి చిన్న అడుగులు. 







ప్రశ్న (తరుణ్): గత రెండు సంవత్సరాల నుంచి మేము ఆన్‌లైన్‌లో చదువుతున్నాము. దీనివల్ల ఆన్‌లైన్ గేమ్‌లు, వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నాము, దీని కారణంగా మా దృష్టి మరలుతోంది. అలా జరగకుండా ఎలా?







సమాధానం: తరగతిలో పాఠం వింటున్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. చాలా సార్లు మీరు క్లాస్‌లో ఉంటారు.. కానీ మీ మనస్సు ఎక్కడో ఉంటుంది. మనస్సు ఇక్కడ లేకపోతే వినడం ఆగిపోతుంది. ఇక్కడ అర్థం కావడం సమస్య కాదు, మనస్సు ఇక్కడ లేకపోవడం. ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా, అది మనస్సుకు కనెక్ట్ అయితే, మీకు ఆన్‌లైన్ కి ఆఫ్‌లైన్ కి తేడా ఉండదు. కాలాన్ని బట్టి మాధ్యమం కూడా మారుతూ ఉంటుంది.