వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌కు ఊరట లభించింది. సైఫ్‌పై విధించిన ఏడాది సస్పెన్షన్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు కాకతీయ మెడికల్ కాలేజీ అధికారులు. హైకోర్టు ఆదేశాలతో... సైఫ్ తిరిగి క్లాసులకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.
వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఫ్రిబవరి 22న కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడ నాలుగు రోజులు చికిత్సపొందూ ఫిబ్రవరి 26న మృతిచెందింది మెడికో ప్రీతి. ప్రీతి మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు... ఆమె మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని తేల్చారు. ప్రీతి మృతికి ఆమె సీనియర్ అయిన... డాక్టర్ సైఫ్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు... పోలీసులకు, కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ర్యాగింగ్ యాక్ట్‌తోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. సైఫ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌లోకి తీసుకున్నారు. కాకతీయ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ప్రీతి మృతి కేసును సీరియస్‌గా తీసుకుంది. ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌పై చర్యలు తీసుకుంది. అతన్ని ఏడాదిపాటు సస్పెండ్ చేసింది.
ఏప్రిల్ 20న సైఫ్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. కాలేజీ యాజమాన్యం ఏడాది పాటు తనను సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాడు. ప్రీతి మృతి కేసులో తన వాదన వినకుండా... కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుందంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. సైఫ్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... కీలక ఆదేశాలు ఇచ్చింది. నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి అయినా సరే... అతని వివరణను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని తెలిపింది. విచారణ తిరిగి నిర్వహించాలని కేఎంసీ వైద్యాధికారులతో పాటు యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించిన కాకతీయ కాలేజీ యాజమాన్యం... సైఫ్‌కు నోటీసు పంపింది.యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. కానీ ఈ సమావేశానికి సైఫ్ హాజరుకాలేదు. దీంతో కాకతీయ మెడికల్ కాలేజీ యాజమాన్యం మళ్లీ హైకోర్టుకు ఆశ్రయించింది.
ఈ క్రమంలో.. సైఫ్ సస్పెన్షన్‌ను తాత్కాలికంగా రద్దుచేసి అతన్ని తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. వారం రోజుల తర్వాత తిరిగి యాంటీ ర్యాగింగ్ కమిటీ పునర్విచారణ జరిపి తీర్మానాన్ని కోర్టుకు సమర్పించాలని సూచించింది. యాంటీ ర్యాగింగ్ కమిటీదే తుది నిర్ణయమని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం... సైఫ్ సస్పెన్సన్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకటించారు. దీంతో సైఫ్‌కు తాత్కాలింకంగా ఊరట లభించినట్టు అయ్యింది.