Preethi Health Bulletin: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి హెల్త్ బులెటిన్ నిమ్స్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వివరించారు. నాలుగు రోజులుగా ప్రీతికి చికిత్స జరుగుతోందని... అయినా ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వివరించారు. ఇంకా ఎక్మో సపోర్ట్ తోనే వెంటిలేటర్ పై ఉంచి ప్రీతికి చికిత్స అందిస్తు్నట్లు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్ఓకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుంది. 


దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్ పై మత్తు ఇంజెక్షన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రీతికి మెరుగైన వైద్య కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు వైద్యులు. నిమ్స్ కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటిలేటర్, ఎక్మోపైనే చికిత్స కొనసాగుతోంది.  ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. 


నిన్నటికి నిన్న ప్రీతిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి


పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండాకు చెందిన పీజీ విద్యార్థిని ప్రీతిని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరో వైపు వరంగల్ సీపీ రంగ నాథ్ తో మాట్లాడి ఈ ఘటనపై తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంకోవైపు ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి ఓదార్చారు. వ్యక్తిగతంగా తాను, ప్రభుత్వం  అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.  ప్రీతికి మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. అలాగే ప్రీతి తల్లిదండ్రులు శారద (రైల్వే లో ఏఎస్ఐ) దరావత్ నరేందర్ నాయక్ లతో వైద్యులను కలిపి ప్రత్యేకంగా మాట్లాడారు.  ప్రీతి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. కుటుంబ సభ్యులకు ఉన్న సందేహాలను నిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్, ఇతర వైద్యులతో మాట్లాడించి నివృత్తి చేశారు. జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 


సైఫ్ అరెస్ట్ 


వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అందుకు కారణంగా భావిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. సీనియర్ పీజీ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి.  విచారణ చేసిన మట్టెవాడ పోలీసులు సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులకు ఛాటింగ్‌లో కొన్ని ఆధారాలు వెలుగు చూశాయి. పోలీసులు సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లుగా ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు.