'కార్తికేయ 2' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరియు అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి స్టార్ డైరక్టర్ సుకుమార్ కథను అందించారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించింది.


మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉండే అమ్మాయి.. ఫోనే ప్రపంచంగా బతికే ఈ జనరేషన్ అబ్బాయి మధ్య జరిగిన కథతో, 18 పేజీల డైరీ నేపథ్యంలో ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న తర్వాత ‘18 పేజెస్’ జనవరిలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. 
'18 పేజెస్' సినిమా తెలుగు ఓటిటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ మూవీకి స్మాల్ స్క్రీన్ పైనా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలోని 'ముంత మసాలా' విషయంలో మాత్రం అందరికీ సందేహాలు ఉన్నాయి. ఇది సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయింది. 


సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ముంత మసాలా తినేటప్పుడు బ్యాగ్ లో నుంచి ఒక పొట్లాన్ని తీసి, అందులోని పొడిని కలుపుకొని తింటుంది. ముంత మసాలా తయారుచేసే అబ్బాయి కూడా అది తిని సూపర్ అక్కా అంటూ ఆశ్చర్యపోతాడు. ఈ విషయాన్ని డైరీ ద్వారా తెలుసుకున్న నిఖిల్ సైతం అదే విధంగా ముంత మసాలా మీద పొడి కలుపుకొని తింటాడు.


ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు ఆ ముంత మసాలా పొడి ఏంటి? అనేది మాత్రం సినిమాలో చూపించలేదు. దీంతో నెట్టింట దీని గురించే పెద్ద చర్చ జరిగింది. 'అయ్యా..ఆ ముంత మసాలాలో కలిపిన పొడిపేరు చెప్పండయ్యా' అంటూ మీమ్స్ వైరల్ చేశారు. ఒక నెటిజన్ అయితే ఈ సందేహాన్ని నేరుగా నిఖిల్ ముందు ఉంచాడు. 
దీనికి నిఖిల్ స్పందిస్తూ.. ఆ పొడికి సంబంధించిన సీక్రెట్ ను త్వరలో డిలేటెడ్ సీన్ గా రిలీజ్ చేస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే తాజాగా నందిని ముంత మసాలా సీక్రెట్ ని రివీల్ చేశారు ‘18 పేజెస్’ మేకర్స్. సినిమాలో తొలగించిన సన్నివేశాన్ని యూట్యూబ్ లో పంచుకున్నారు. ముంత మసాలాకి అంత టేస్ట్ రావడానికి కారణం పిప్పర్ మెంట్ అనే విషయాన్ని వెల్లడించారు.  


ఈ వీడియోలో ‘‘నందిని అక్క ముంత మసాలాలో ఏం కలిపిందో మీరైనా చెప్పండి సార్’’ అని బాయ్ అడగ్గా.. "పిప్పర్ మెంట్" అని నిఖిల్ సమాధానం చెప్తాడు. "నిజం సార్.. పిప్పర్ మెంటే.. దీనెవ్వ.. ముంత మసాలాలో పిప్పర్ మెంట్ కలిపితే ఇంత టేస్ట్ వస్తదని నాకు నిజంగా తెలియదు సార్" అని ఆ అబ్బాయి చెప్పడంతో ఈ సీన్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.



‘18 పేజెస్’ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై బన్నీ వాసు నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. తమిళ్ హీరో శింబు ఈ సినిమాలో ఒక పాట పాడటం విశేషం. శ్రీకాంత్ విస్సా సంభాషణలు రాయగా.. ఎ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రమణ వంక ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. 


Also Read : ఈ అందాల భామలకు అదృష్టం దక్కేనా? హిట్టు లేక విలవిల!