Congress Operation Aakarsh in Warangal: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు నెల రోజులు పూర్తి కావొస్తోంది. ఇంతలోనే 'ఆపరేషన్ ఆకర్ష్' (Operation Aakarsh) మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన బీఆర్ఎస్ (BRS) నేతలను హస్తం (Congress) పార్టీలోకి చేర్చుకునేలా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. బుధవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (Greater Warangal Corporation) కు చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లే చేరారు. మరో 15 మంది హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ కీలకంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
2021లో ఇదీ పరిస్థితి
వరంగల్ కార్పొరేషన్ లో.. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 48 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 10 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకుని మూడో స్థానంలో నిలిచింది. స్వతంత్రులు ఒకటి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లపై గురి పెట్టింది. ఇందులో భాగంగా బుధవారం ఆరుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా, మరో 15 మంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు హస్తం గూటికి చేరిన వారిలో ఉన్నారు. బీజేపీ నుంచి సైతం ఇద్దరు కార్పొరేటర్లు చేరారు. వరంగల్ తూర్పు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.
ఇదే కారణమా.?
కార్పొరేటర్ల పదవీ కాలం మరో రెండేళ్లు ఉండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ కార్పొరేటర్లు డివిజన్ అభివృద్ధి పేరుతోనో, లేక ఇతర కారణాలతో అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. గ్రేటర్ వరంగల్ లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉండగా.. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు 34 మంది కార్పొరేటర్లు కావాలి. అయితే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినా.. మేయర్ పీఠానికి వచ్చిన నష్టం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తర్వాతే అవిశ్వాసం పెట్టి పడగొట్టవచ్చని చెబుతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు అది జరిగే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. అయితే, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు కాంగ్రెస్ లో కార్పొరేటర్లు చేరితే బలం చేకూరుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో కింద స్థాయి నేతల నుంచి 'ఆపరేషన్ ఆకర్ష్' మొదలుపెట్టి పూర్తిగా నేతలను చేర్చుకునేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.
Also Read: Congress Sharmila News : షర్మిల చేరికపై తెలంగాణ కాంగ్రెస్ లైట్ - ఒక్కరూ పట్టించుకోలేదు !