BRS Leader Navya Submitted Nomination For Station Ghanpur : జానకీపురం సర్పంచ్‌ కుర్చపల్లి నవ్య (Sarpanch Navya) స్టేషన్‌ ఘన్‌పూర్‌ (Station Ghanpur) నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పర్వానికి నేడే చివరి రోజు కావడంతో సర్పంచ్ నవ్య భర్తతో కలిసి నామినేషన్‌ వేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) తనకు అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే‌గా నామినేషన్ వేస్తానని గతంలో నవ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా నామినేషన్ వేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. 


ఎవరి ప్రమేయం లేదు
నామినేషన్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన నామినేషన్ వెనుక ఎవరి హస్తం లేదన్నారు. ఎవరి మీద తమకు కోపం, పగ లేవన్నారు. కేవలం రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశం, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే నామినేసన్ వేసినట్లు చెప్పారు. రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని, అవి మహిళలకు వర్తిస్తాయని అన్నారు. ప్రజలు కూడా వంద శాతం రాజకీయాల్లోకి రావాలని.. అందుకే తాను పోటీ చేసేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు.


అన్ని గ్రామాలకు వెళ్తా
ఓ చెల్లిలా, అక్కలా, తమ కుటుంబంలోని ఓ వ్యక్తిలా ఆశీర్వదించాలని, ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రచారం కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటామన్నారు. తనకున్న జ్ఞానాన్ని పది మందికి పంచుతానని, ఎదుటివారి దగ్గరి నుంచి నేర్చుకుంటానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. 


గతంలోనే చెప్పిన నవ్య
స్టేషన్ ఘన్‌పూర్‌ నుంచి తాను కూడా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నవ్య గతంలో విజ్ఞప్తి చేశారు.  బీఆర్ఎస్ అధిష్ఠానం ఆ సీటును ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించింది. అయితే నవ్య ఈ రోజు స్వయంగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ముందు తాను ఓ వార్డు మెంబర్‌గా గెలిచానని, ఇప్పుడు సర్పంచ్‌గా ఉన్నట్లు చెప్పారు. తాజాగా ఎమ్మెల్యే అయ్యేందుకు నామినేషన్ వేసినట్లు తెలిపారు. 


గతంలో సానుభూతి వ్యక్తం
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా రాజయ్య సీటు రాకపోవడంపై సర్పంచ్ నవ్య గతంలో స్పందించారు. రాజకీయాల్లో ఎన్ని జరిగినా.. తనకూ మానవత్వం ఉందని.. ఆ ఏడవటం చూస్తుంటే బాధ అనిపించిందంటూ తన సానుభూతి వ్యక్తం చేశారు. రాజకీయంలో ఎన్ని చేసినా చివరికి ఓ పదవి కోసం ఆరాటం ఉంటుందని.. రాజయ్యకు టికెట్ రాకపోవటం కొంచెం బాధగానే ఉందని చెప్పారు. 


రాజయ్యపై సంచలన ఆరోపణలు చేసిన నవ్య
ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ గతంలో సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని.. నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని వేధిస్తున్నాడని నవ్య ఆరోపించారు. మరోవైపు నవ్య తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించారు. నవ్య ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. నవ్య చేసిన ఆరోపణల వల్లే రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదన కూడా ఉంది.