War is going on for ticket in Mahbub Nagar BJP :  పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ పాలమూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసే బీజేపీ అభ్యర్థిగా ఎవరు అనే అంశంపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రసవత్తర చర్చలకు తెరలేపుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి పేరు ఇప్పటికే ఖరారు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీపై పడింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు రంగంలో ఉండనున్నారనే అంశం కన్నా అభ్యర్థి పైననే చర్చలు ఎక్కువగా సాగుతున్నాయి.


పాలమూరు టిక్కెట్ కోసం ఫుల్ డిమాండ్              


ఈ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకుని ఎన్నికల పోరులో నిలవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంత‌కుమార్ ఆశిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలతో ఉన్న పరిచయాలతో టిక్కెట్ సాధించుకోవాలని ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు.  ప్రజలకు చేరువ అయ్యేందుకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంత కుమార్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెండు నెలలుగా ఆయా నియోజకవర్గాలలో పర్యటనలు చేసి పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడంతో పాటు.. పలు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రారంభించిన బస్సుయాత్రలో ముగ్గురూ పాల్గొంటున్నారు.


టిక్కెట్ ఎవరికో చెప్పని హైకమాండ్             
 
టికెట్ ఎవరికి వస్తుందనే అంశంలో పార్టీ శ్రేణులు అంచనాకు రాలేకపోతున్నారు.   డీకే అరుణ గత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించారు.  ఈసారి ఎన్నికల్లో తనకు గెలిచే అవకాశాలుంటాయని గట్టిగా చెబుతున్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి మాత్రం ఎన్నికలలో టికెట్ తనకు వచ్చే ఎన్నికల్లో ఇవ్వాలన్న ఒప్పందంతోనే చేరిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తన కుమారుడిని పోటీలో ఉంచానని, ఇప్పుడు తనకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ విషయం చెప్పకపోవడంతో అసంతృప్తికి గురై ఆయన ట్వీట్లు పెడుతున్నారు.              


           





 హైకమాండ్ తర్జన భర్జన 


టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశం అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, అభ్యర్థి ఎవరనే అనే అంశం తేలడానికి మరో వారం, పది రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ కోసం పోటీ పడుతున్న వారంతా బలమైన నేతలు కావడంతో  హైకమాండ్ కూడా రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.