హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. కేబినెట్ లోకి ముగ్గురు నేతలకు అవకాశం లభించింది. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ మొదట వివేక్ వెంకటస్వామితో ప్రమాణం చేయించగా, అనంతరం అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు ఫ్లవర్ బొకే ఇచ్చి మంత్రివర్గంలోకి స్వాగతించారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి అనసూయ (Seethakka), కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డిజిపి జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణలో 15 మంది మంత్రులు.. సామాజిక సమీకరణాలు..
64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో బీసీలు 7 మంది ఎమ్మెల్యేలు ఉండగా పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరిలకు మంత్రి పదవులు వచ్చాయి.
రెడ్డి సామాజివకవర్గం నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉండగా.. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, వివేక్, అడ్లూరి లక్ష్మణ్
బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు.
ఎస్టీ సామాజిక వర్గం నుంచి దనసరి అనసూయ (సీతక్క)
వెలమ, కమ్మ సామాజికవర్గాల నుంచి జూపల్లి కృష్ణారావు, తుమ్మలనాగేశ్వరావు మంత్రులుగా కొనసాగుతున్నారు.
ఏడాదిన్నర తరువాత కేబినెట్ విస్తరణ
2023 డిసెంబర్ లో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. దాదాపు 18 నెలలకు కేబినెట్ విస్తరణ చేశారు. కేబినెట్‌లో కొత్తగా ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఎస్సీల నుంచి ఇద్దరు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిలను మంత్రి పదవి వరించింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న పలుమార్లు రాష్ట్ర కేబినెట్ విస్తరణ అని ప్రచారం జరిగేది. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్ది సుదర్శన్, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, విజయశాంతిలకు కేబినెట్ ఛాన్స్ దక్కుతుందని ప్రచారంలో ఉండేది. మరికొందరు నేతలు సైతం తమకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేవారు.
ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టాక పరిస్థితిలో మార్పు వచ్చింది. రాష్ట్ర మంత్రులతో పాటు సీనియర్ నేతలు, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించిన తరువాత మాల నుంచి వివేక్, మాదిగ సామాజిక వర్గం నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిలకు మంత్రి పదవులు ఇచ్చారు. మక్తల్ నియోజకవర్గానికి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.