Chitrakoot: రామాయణ కాలంలో శ్రీరాముడు,సీతాదేవి, లక్ష్మణుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. వనవాసంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో సంచరించిన సీతారామలక్ష్ణణులు ఎక్కువ రోజులు చిత్రకూట్ లోనే గడిపారు. మొత్తం 14 ఏళ్ల వనవాసంలో పదకొండేళ్లు చిత్రకూట్ లోనే గడిపారు. అందుకే ఇది కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే కాదు శ్రీరాముడి ప్రత్యక్ష ఉనికికి నిదర్శనంగా ఉంది. ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాల్లో రామ్ శయ్యా ఒకటి. 

చిత్రకూట్ మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో  చిత్రకూట్‌కు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుంది. దాన్ని చూడగానే ఆ రామచంద్రుడిని చూసినంత భక్తిపారవశ్యంలో మునిగిపోతారు భక్తులు. ఈ రాయిపై ఇప్పటికీ సీతారాముల విశ్రాంతి చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ బండ పొడవు, దానిపై ఉన్న గుర్తులు చూసి రాముడు ఎంత పొడుగు ఉండేవాడో అని తలుచుకుంటారు. పాదముద్రల ఆధారంగా కూడా ఆజానుబాహుడిని తలుచుకుంటారు. సీతారాముల గుర్తులతో పాటూ ఈ రాయిపై విల్లు గుర్తులు కూడా కనిపిస్తాయి. 

చిత్రకూట్ లో ఉన్నన్ని ఏళ్లూ సీతారాములు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారని స్థలపురాణం. దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తారు. రామ్ శయ్యాను సందర్శించుకునేవారికి వైకుంఠప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. చిత్రకూట్ లో ఉన్న ఈ ప్రదేశం  పురావస్తు వారసత్వంగా ఉండటమే కాదు..భక్తి విశ్వాసాలకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రతి రామ భక్తుడిని చిత్రకూట్ ఆకర్షిస్తుంది.

భరతుడు తన సోదరుడిని తిరిగి రాజ్యానికి తీసుకెళ్లేందుకు ఒప్పించేందుకు ప్రయత్నించిన ప్రదేశం ఇదే. రాముడు చిత్రకూట్ లో ఉన్నప్పుడే తండ్రి దశరథుడి మరణ వార్త విని..ఆయనకు కర్మకాండలు నిర్వహించిన ప్రదేశమూ చిత్రకూట్. ఈ ప్రదేశం నుంచే రాముడి పాదులకు తీసుకెళ్లి పాలన చేశాడు భరతుడు. అందుకు గుర్తుగా భరతుడికి ఇక్కడ చిన్న గుడి కట్టారు. సీతారామలక్ష్మణులే కాదు ఎందరో మునులకు ఆవాసంగా ఉండేది చిత్రకూట్.  

ఇక్కడున్న మందాకినీ నది ఒడ్డున ఉన్న ఘాట్ ఒడ్డునే రామచంద్రుడు నిత్యం స్నానం ఆచరించేవాడని ఆ సన్నివేశాలను తన మనోనేత్రాలతో సందర్శించానని తులసీదాస్ తన రామచరిత మానస్ లో పేర్కొన్నారు. దీనికి కొద్దిదూరంలోనే సీతాదేవి స్నానం చేసిన జానకి కుండ్ ఉంటుంది.

చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3 వేల కిలోమీటర్ల ఎత్తులో హనుమాన్ ధార ఉంటుంది. దాదాపు రెండువేల మెట్లు ఎక్కితే ఇక్క పెద్ద హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని అభిషేకించే నీటిధార ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఈ జలాన్నే ప్రసాదంగా స్వీకరిస్తారు.

చిత్రకూటంలో ప్రతి నెలలో అమావాస్య రోజు భారీ ఉత్సవం జరుగుతుంది. ముఖ్యంగా దీపావళి అమావాస్య మరింత ప్రత్యేకం. ఈ రోజు జరిగే ఉత్సవానికి భారీగా భక్తులు తరలివస్తారు. యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మంత్రిత్వ శాఖలు విడివిడిగా వసతి సదుపాయాలు అందుబాటులో ఉంచారు. వీటితో పాటూ ప్రైవేట్ హోటళ్లు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి చిత్రకూట్ కి 500 కిలోమీటర్లు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే.  దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం