Viral Fevers Outbreak In Telangana: తెలంగాణలో వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వైరల్ ఫీవర్స్‌తో ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో ఈడుపుగంటి సామ్రాజ్యం (67) అనే మహిళకు వారం కింద జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అటు, ఇదే మండలం బ్రహ్మళకుంటకు చెందిన బానోతు కృష్ణ (50)కు వారం కింద ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో కల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, కామారెడ్డి - సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి చెందిన మనస్విని (11)కి జ్వరం రాగా కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.
అటు, ఇదే కామారెడ్డి - సదాశివనగర్‌లో నరేశ్ (29) అనే వ్యక్తి డెంగీతో మృతి చెందాడు. అలాగే, కరీంనగర్ - ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్ (26) జ్వరంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను స్థానికంగా చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురి కాగా కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. మరోవైపు, మహబూబాబాద్ - కొత్తగూడ మండలం హనుమాన్ తండాలో రాజేందర్, సంధ్య దంపతులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులు కుమార్తెకు 5 రోజుల కిందటే జ్వరం వచ్చి తగ్గింది. స్వగ్రామంలో పని ఉందని కూతురితో కలిసి వెళ్తుండగా.. దారిలో జ్వరం ఎక్కువై ఫిట్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెను నర్సంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
'ప్రతి జ్వరం డెంగీ కాదు'
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతి జ్వరాన్ని డెంగీ అని చెప్పి చికిత్స కోసం భారీగా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 'డెంగీ ఉదయం పూట కుట్టే ఏడిస్ దోమల ద్వారా వ్యాపించే ఓ సాధారణ జ్వరం. ఇది కార్పో వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, కంటి లోపలి భాగం నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాలు, కీళ్లనొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. టీ - 1, టీ - 2, టీ - 3 లక్షణాలతో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. అవి 20 వేలకు తగ్గినా ఇబ్బంది ఉండదు. తిరిగి అవే వృద్ధి చెందుతాయి. ప్రస్తుత సీజన్‌లో జ్వరాలతో ఎక్కువ మంది ఆస్పత్రులకు వస్తున్నారు. మరికొందరు నిర్లక్ష్యంతో సొంత వైద్యం చేసుకుంటున్నారు. అలా కాకుండా లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.' అని వైద్యాధికారులూ సూచించారు.
'హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి'
మరోవైపు, రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాల విజృంభణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక్కరోజులో 5 మంది డెంగీతో చనిపోయినట్లు వార్తాకథనాలు పేర్కొంటున్నాయి. ఈ డేటాను ఎవరు ఎందుకు దాచిపెడుతున్నారు.?' అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవని.. చాలా ఆస్పత్రుల్లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.