Congress One Month Rule in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తవుతోంది. తమ నెల రోజుల పాలనపై నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని పేర్కొన్నారు. నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం.. నీటి పారుదల శాఖలో జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నాం అని తెలిపారు.


తెలంగాణలో కొత్తగా స్వాతంత్య్రం వచ్చిన ఫీలింగ్..
కాంగ్రెస్ పాలన మొదలుకాగానే రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కొత్తగా స్వాతంత్య్రం వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రజా భవన్ లోకి సామాన్యులను అనుమతించి ప్రజా వాణి (Prajavani in Telangana) ద్వారా వారి సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ చర్యలు చేపట్టింది. ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పాలకులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలన ఆశిస్తున్నారో అది వారికి అందుతోంది. తనకు బాధ్యతలు అప్పగించిన నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలపై సమీక్షలు చేసినట్లు తెలిపారు.


కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన అంశం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు చెందిన మెడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం లాంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష చేసింది. జ్యూడిషియల్ ఎంక్వరీ కోసం ఒక సిట్టింగ్ జడ్జి ని నియమించాలని కోరినట్లు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై, కాళేశ్వరం ఓవరాల్ ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన లోపాలపై ఉన్నతాధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలకు, మీడియా వాళ్లకు వాస్తవాలు తెలిపాం. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.


నెల రోజుల పాలనపై సంతృప్తిగా ఉన్నాం.. 
పౌరసరఫరా శాఖలో 58 వేళ కోట్ల రూపాయల అప్పులు పేరుకు పోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేదలకు ఇస్తున్న బియ్యం కిలో 38 రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందన్నారు. దీన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగ పడేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నెల రోజుల పాలన అత్యంత సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ లో అత్యంత పారదర్శకంగా పారదర్శకంగా, జవాబు దారి తనంతో పని చేస్తామని తాజా ప్రకటన ద్వారా ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు.


Also Read: ఈ నెల 8న తెలంగాణ కేబినెట్ భేటీ - నెల రోజుల పాలన, 6 గ్యారెంటీల అమలుపై సమీక్ష