Chandrababu Naidu Comments: టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ రివర్స్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని విమర్శించారు. దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని మండిపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 'రా.. కదిలిరా' అని పిలుపునిస్తున్నా అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సభలో చంద్రబాబు మాటాడుతూ జగన్ పాలనను ఎండగట్టారు.


తిరువూరు సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ‘తెలుగు యువతకు నేను ఐటీ అనే ఆయుధం ఇచ్చాను. ఐటీ ద్వారా ఎన్నో కుటుంబాలు దేశ విదేశాలకు వెళ్లాయి. ఇటీవల నాకు ఇబ్బంది వస్తే 80 దేశాల్లో సంఘీభావం తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోంది. రాష్ట్రం ఇలా అవటానికి సీఎం జగన్ రివర్స్ పాలనే. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్లాడు. జగన్ ఓ దుర్మార్గుడు. రాష్ట్రంలో అందరూ జగన్ బాధితులే. నేను కూడా బాధితుడినే. జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాలి’ అని అన్నారు.


‘టమోటోకి పొటాటోకి తేడా తెలియని సీఎం. అతడికి వ్యవసాయం గురించి తెలుసా?. జగన్ పాలన తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్టు ఉంది. పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం జగన్ గోదావరిలో కలిపేసాడు. ఎక్కడైనా కాంట్రాక్టర్లను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టేవారు. ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. 3 నెలల్లో సైతాన్ ప్రభుత్వం పోతోంది. రైతు రాజ్యం రాబోతోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ అమరావతి రాజధాని అన్నాడు. రాష్ట్రానికి ఉన్న రాజధానిని కూడా లేకుండా చేశాడు. ఐదేళ్లు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్. 3 రోజుల రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడాడు. విశాఖలో కొండకు బోడి గుండు కొట్టి ప్యాలస్ కట్టేశారు జగన్. మళ్ళీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది. మన రాజధాని అమరావతి’ అని అన్నారు.