DK Aruna Comments: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ (Telangana BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందనే.. ప్రజలకు ఆరు గ్యారెంటీలు (Congress Six Guarantees) ఇచ్చారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పకుండా వస్తాయని,  గతంలో భారీగా నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. 


కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని,  కాంగ్రెస్‌ ప్రభుత్వం సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయ విచారణ కేవలం కాలయాపన కోసమేనన్న ఆమె... కాళేశ్వరం అవినీతి సీబీఐ చేత విచారణ చేయించాలని కోరారు. కమీషన్ల కోసం ప్రాజెక్ట్‌ను నాణ్యతాలోపంతో కూడిన డిజైన్‌ చేశారని మండిపడ్డారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జుడిషియల్ ఎంక్వైరీ అంటే కాలయాపన చేయడమేనని డీకే అరుణ ఆరోపించారు. మెడిగడ్డ బ్యారేజి కుంగడం, అన్నారం పంపులు మునగడానికి  ప్రాజెక్టు డిజైన్ లోపమే కారణమని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు వంద రోజుల టైమ్ అడిగారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉండాలని సూచించారు.