ధాన్యం కొనుగోళ్ల వరకూ తేల్చే వరకూ ఢిల్లీ నుంచి కదలబోమని చెప్పిన తెలంగాణ మంత్రులు చివరికి ఎలాంటి హామీ పొందకుండానే వెనక్కి వచ్చారు. దాదాపుగా వారం రోజులుగా మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లపై లిఖిత పూర్వకమైన హామీ కోసం వారు పట్టుబట్టారు. అయితే పీయూష్ గోయల్ మాత్రం భిన్నమైన సమాధానం చెప్పారు. బాయిల్డ్ రైస్ ఒక్క కేజీ కూడా కొనబోమని తెగేసి చెప్పారు. రా రైస్ ఎంత తీసుకుంటామో ఇప్పుడే చెప్పలేమన్నారు. సమావేశం జరిగినప్పుడు రెండు రోజుల్లో చెబుతానన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆయనను కలిసేందుకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ ద్వారా తెలంగాణ మంత్రులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో మంత్రులు వెనక్కి రావాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ తిరిగి వచ్చే ముందు తెలంగాణ మంత్రులు ఢిల్లీలోప్రెస్‌మీట్ పెట్టారు. ఇప్పటికే కేంద్రం తమకు కోటా కింద చెప్పిన కోటా మొత్తం సేకరించామని ఇంకా అరవైలక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉందని దాన్ని ఎవరు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రాల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని మంత్రులు మండిపడ్డారు. కనీస మద్దతు ధర నిర్ణయం, ఎగుమతులు, గోడౌన్లు, రైల్వే లు కేంద్రం చేతిలోనే ఉన్నాయని.. ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రమే కొనుగోలు చేసి ఇండియా గేట్ వద్ద పారబోస్తామని హెచ్చరించారు.
Also Read: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్ - తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !
రైతుల ఆదాయం రెండింతల రెట్టింపు చేస్తామన్నారని.. ఎక్కడ రెట్టింపు చేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. రూ. 80, 90 వేల కోట్ల రూపాయల విదేశీ ధనం వెచ్చించి వంట నూనెలు తెచ్చుకుంటున్నామని .. దేశ రైతులకు వంట నూనెలు పండించే దారి చూపడం లేదని విమర్శించారు. 140 కోట్లా జనాభా నైపుణ్యాన్ని నిరుగారుస్తున్నారని మండిపడ్డారు. దేశంలో పప్పు దినుసుల కొరత ఉందని రాబోయే వానాకాలంలో తెలంగాణలో 3-5 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిచారు.
బీజేపీ నేతలు ఉపన్యాసలు ఇచ్చి అదే దేశభక్తి అని చెబుతున్నారని కానీ ప్రజల కడుపు నిండితేనే దేశభక్తి. అని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంపై కేంద్రం చూపు హానికరంగా.. ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం వచ్చి ఢిల్లీలో ఎదురుచూస్తుంటే చిన్నచూపు చూస్తున్నారని..కేంద్ర ప్రభుత్వ విజ్ఞత ఇక్కడే బయటపడుతోందన్నారు. రైతుల అంశం రాజకీయంతో చూసేది కాదన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తామని..కేంద్ర ప్రభుత్వ లేఖ కోసం వేచి చూస్తామని మంత్రులు ప్రకటించారు. తర్వాత తిరుగుపయనమయ్యారు.