బీజేపీ నేతలు ఢిల్లీలో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని.. తెలంగాణ మంత్రులను ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడటం రాష్ట్రాన్ని అవమాన పరచడమేనని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు రైతుల కోసం ఢిల్లీలో పోరాడుతున్నారని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ పార్టీల నేతలు పైరవీల కోసం ఢిల్లీకి వెళితే.. మేము మాత్రం తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామని .
తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ పడ్డ కష్టం అందరికీ తెలుసునని.. చావు నోట్లో తలకాయ పెట్టిన నేత టీఆర్ఎస్ అధినేత అని గుర్తు చేశారు. అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్లం కాదు అన్నారు. తెలంగాణ నేతలను బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు బిచ్చగాళ్లుగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం భాద్యతే, కానీ తప్పించుకునే ప్రయత్నంలో బీజేపీ లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు ఏం చెప్పారు, ఇపుడు ఏం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని చెప్పి మోదీ మాట తప్పారన్నారు.
‘తెలంగాణ మంత్రులను అవమాన పరిచి, ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతాం. చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తాం. మా మంత్రులు పరిస్థితుల ప్రభావంతో హైదరాబాద్‌కు తిరిగి రావొచ్చు. కానీ పులి రెండు అడుగులు వెనకేసినంత మాత్రానా సినిమా పూర్తి కాలేదుని గుర్తుంచుకోండి. రైతుల కోసం అన్ని పార్టీలు ఒక్కటైన సందర్భాలు అనేకం. కానీ తెలంగాణ లో ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల ఆగ్రహానికి బీజేపీ గురి కాక తప్పదు.
వరి వేయాలా.. వద్దా ?
యాసంగి లో వరి వేయాలా వద్దా స్పష్టంగా కేంద్రం స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద కోపంతో, అధికార దాహంతో బీజేపీ తెలంగాణ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా గొప్పగా ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇది ఓ తెలంగాణ సమస్య కాదు. దేశ రైతులు కేసీఆర్ వెంట ఉన్నారు. కేసీఆర్ పిలుపు కోసం వారు ఎదురు చూస్తున్నారు. పంజాబ్‌కు ఓ విధానం.. విధానం కర్ణాటకకో విధానం.. తెలంగాణకు ఓ విధానమా..? రైతులను మోసం చేయాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి కేంద్రం గురికాక తప్పదు. క్షమాపణ చెప్పి రాష్ట్ర రైతులకు కేంద్రం న్యాయం చేయాలి. ధాన్యం సేకరణపై కేంద్రం హామీ లేఖ ఇస్తే ఢిల్లీ ఒడిపోయినట్టు కాదు. రైతులు గెలిచారనుకోవాలి.
తీర్మానాలను పక్కనపెట్టిన కేంద్రం..
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్న తీర్మానాలను ఢిల్లీకి పంపించినా తెలంగాణకు న్యాయం చేయడం లేదు. బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం తెలంగాణ తీర్మానాలను పక్కన పెట్టడం నిజం కాదా.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదని, ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారు. వారి కుట్రలను తిప్పి కొట్టేందుకు మా వద్ద వ్యూహాలున్నాయి. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగు పడదు. కనుక కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రైతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.
Also Read: Sangareddy: పగలంతా ఫుడ్ డెలివరీ బాయ్స్.. రాత్రికి పాడు పనులు, కిటికీల వద్దకు వెళ్లి..